Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబట్టతలల భవిత ఏమిటి?

బట్టతలల భవిత ఏమిటి?

Bald Head problems:
పద్యం:-
“ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!”

అర్థం:-
ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. ఆ చిన్న కుదుపుకు పండిన తాటికాయ సరిగ్గా అతడి నెత్తిన పడి…తల టప్ మన్న శబ్దంతో రెండుగా చీలిపోయింది. దైవం చిన్న చూపు చూసిన వారి వెంట ఆపదలు వేటకుక్కలా వెంటపడి వేధిస్తాయి.

Head Groom

ఇదివరకు హై స్కూలు తెలుగు పాఠాల నీతి పద్యాల్లో తప్పనిసరిగా ఉండే పద్యమిది. ఇప్పుడు స్కూలు పిల్లలకే ఆ బట్ట తలలు వచ్చి…చిన్నవయసుకే తలలు పండి ముగ్గు బుట్టలవుతున్నాయి కాబట్టి…ఈ దైవోపహతమయిన బట్టతల పద్యం చదవదగ్గ పాఠంగా ఉందో? లేదో? తెలియదు.

ఆకారం- వికారం అన్నవి రూఢిని బట్టి స్థిరపడతాయి. అందరికీ నెత్తిన జుట్టు ఉండడం సహజం. అలా నెత్తిన జుట్టు ఉన్నవారి ఆకారం బాగున్నట్లు…జుట్టు లేనివారు వికారంగా ఉన్నట్లు…ఒక అలిఖిత ప్రమాణం స్థిరపడిపోయింది. దాంతో జుట్టులేనివారిని, బట్టతలవారిని సమాజం అనాదిగా చిన్నచూపు చూస్తోంది. ఎగతాళి చేస్తోంది. అదోలా చూస్తోంది.

ఈ అవమానాలను భరించలేక కొన్ని బట్టతలలు తమ నున్నని రన్ వే మీద కొత్తగా వెంట్రుకలను పొడిపించుకుంటున్నాయి. కొన్ని బట్టతలలు తమ సువిశాల క్రికెట్ గ్రవుండ్ మీద హెయిర్ గ్రాఫ్టింగ్ చేయించుకుంటున్నాయి. పుడమి పొలంలో దుక్కి దున్ని…ఎరువులు చల్లి…నారుపోసి…నీరుపోసి…పైరు పెట్టడంలా…  నిగనిగలాడే ఎడారి తలను దున్ని…చిల్లులు పెట్టి…నూనెలు చల్లి…ఒక్కో వెంట్రుక నారు నాటి…నీరు పోసి…పెంచి పెద్ద చేసి…నాటిన వెంట్రుక ఊడిపోకుండా నిలబెట్టడం రాకెట్ సైన్స్ కంటే సంక్లిష్టమయినది.

Head Groom

అందం ఒక ఆకర్షణ.
అందం ఒక వల.
అందం ఒక వ్యామోహం.
అందం ఒక ఆత్మవిశ్వాసం.
అందం ఒక తప్పనిసరి.
అందం ఒక వ్యాపారం.
అందం ఒక వ్యసనం.
అందం ఒక శాంతి.
అందం ఒక భ్రాంతి.

అలాంటి అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి…బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి.

బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు.
Head Groom

“ఊరుకున్నంత ఉత్తమం లేదు;
బోడి గుండంత సుఖం లేదు”
అన్న సామెతను కొందరు ట్రూ స్పిరిట్లో తీసుకుని…బట్టతల సమస్యకు శాశ్వత గుండుతో పరిష్కారం కనుక్కున్నారు. వీరిది శాశ్వత నిజ వైరాగ్య ఆమోదయోగ్య ప్రాక్టికల్ సిద్ధాంతం.

వెంట్రుకతో సమానమయిన వెంట్రుకల మీద వ్యామోహం ఉండకూడదనే పుణ్యక్షేత్రాల్లో తల నీలాలు భక్తి భావనతో సమర్పణ చేస్తూ ఉంటాం. అహంకారానికి తల, తలలోని ఆలోచనలు కారణం. అలాంటి తల నరికి దేవుడి కాళ్లమీద పెట్టాలి. తల నరుక్కుంటే బతికి ఉండము కాబట్టి…తలమీద వెంట్రుకలను నరకడం ప్రతీకాత్మకం. ఇంతకంటే ఇంకా లోతయిన తాత్వికత కూడా గుండు కొట్టించుకోవడంలో ఉంది కానీ…ఆ విషయాలు ఇక్కడ అనవసరం.

గుండును గుండు అంటే బాధ. ఎగతాళి. అవమానించడం. ఆట పట్టించడం.

తెలుగు సాహిత్యం లోతులు తెలిసిన హాస్య నటుడి ఇంటిపేరు మారి “గుండు” సుదర్శన్ అయినా…ఆయన దాన్ని పాజిటివ్ గా తీసుకుని వెళ్లిన చోటల్లా హ్యాట్స్ ఆఫ్ అని ఆయనకు ఆయనే టోపీ తీసి తన శాశ్వత గుండు పుట్టు పూర్వోత్తరాలను హాస్యరసభరితంగా వివరిస్తూ ఉంటారు.

గుండె జారినా పరవాలేదు కానీ…వెంట్రుకలు రాలుతుంటే మనసు మనసులో ఉండదు. మెదడు చల్లబడి…కొయ్యబారినా పరవాలేదు కానీ…జుట్టు తెల్లబడకూడదు. వయసు ఎనభై దాటి ఏ అవయవమూ స్పందించకపోయినా పరవాలేదు కానీ…నెత్తిన జుట్టు రంగు నలుపు తగ్గకూడదు.

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో ఒక బట్టతలకు కుదరక కుదరక పెళ్లి కుదిరింది. ఆ ఉక్కిరి బిక్కిరిలో తడబడి…సరిగ్గా తాళి కట్టడానికి ముందు…కింద పడ్డాడు. అంతే…జరగకూడనిది జరిగిపోయింది. పెట్టుకున్న విగ్గు ఊడి కింద పడింది. బట్టతల తళతళలాడుతూ బయటపడింది. ఈ వికారమయిన బట్టతలను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని పెళ్లి కూతురు భీష్మించుకు కూర్చుంది. వివాదం పోలీసు స్టేషన్ కు వెళ్లింది. పెళ్లి ఏర్పాట్లకు అమ్మాయి తరుపువారు పెట్టిన దాదాపు ఆరు లక్షల రూపాయలు చెల్లించి బట్టతల తరుపువారు బతుకు జీవుడా! అనుకుంటూ బయటపడ్డారు.

ఇందులో న్యాయం, ధర్మం, అందం- వికారాల స్పృహ, మోసం, ఆత్మన్యూనత లాంటి విషయాల చర్చలో ఎవరి వాదన వారిది.

కానీ…
ఇదే ఒక కొలమానమయితే…ఇక లోకంలో బట్టతలలకు పెళ్లిళ్లు అయ్యేదెప్పుడు?
బట్టతలలు తల ఎత్తుకుని తిరిగేదెన్నడు?

నెత్తిన ఒత్తయిన జుట్టున్న కరకు మనసు హంతకుడినయినా భరిస్తుంది కానీ…
మెత్తటి మనసున్న నెత్తిన జుట్టులేని మంచి మనిషిని మాత్రం భరించనే భరించదు పాడు లోకం!

పద్యంతో మొదలుపెట్టాము కాబట్టి చివర ఫలశ్రుతిగా పద్యం కాని పేరడీ పద్యంతోనే ముగిద్దాం!

“ధర విగ్గుధరుండొకండు వనితా కర పరిగ్రహణ మనస్కుడై త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ పెళ్లి మంటపంబున; తత్ విగ్గు జారి బయటపడెన్ బట్టతల శబ్ద యోగంబుగా;బొరి బట్టతలలు వోవు కడకుం పోవుంగదా యాపదల్!”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

చిత్రం- విచిత్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్