Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభక్తికి మెట్లు

భక్తికి మెట్లు

Devotees with Dedication: తిరుపతిలో మా అమ్మానాన్న ఉంటారు. ఎప్పుడు తిరుపతి వెళ్లినా కాలినడకన తిరుమల వెళ్లి వస్తూ ఉంటాను. అలా అలిపిరి మెట్ల దారిలో వెళ్లినప్పుడు ఎదురయిన అనుభవాలివి.

భక్తి సోపానాలు
కుటుంబంలో ఒకరు పసుపు, ఒకరు కుంకుమ పట్టుకుని ప్రతి మెట్టుకు బొట్టు పెడుతున్నారు. మరి కొందరు కర్పూరం బిళ్ళను ప్రతి మెట్టు మీద పెడుతుంటే వెనుక కొవ్వొత్తితో వస్తున్నవారు వెలిగిస్తున్నారు. కనీసం ఒక పది మందిని అడిగాను. కొందరు మొక్కు తీరి…కృతజ్ఞతతో పెడుతున్నారు. కొందరు మొక్కు తీర్చమని భగవంతుడిని వేడుకుంటూ పెడుతున్నారు. మూడున్నర వేలకు పైబడి మెట్లు మూడు గంటల్లో ఎక్కడమే నాలాంటివారికి పెద్ద ఘనకార్యం. ప్రతి మెట్టుకు వంగి లేచి బొట్లు పెట్టి, హారతులు వెలిగించే వారిముందు నా భక్తి ఏపాటి?

దేవుడిని చేరే మార్గం కూడా దైవంతో సమానం. అక్కడి కోనేరు గంగాజలం, అక్కడి చెట్లు మునులు, అక్కడి శిలలు సాలగ్రామాలు అని అన్నమయ్య అందుకే అన్నాడు.

మెట్లెక్కిన కృత్రిమ కాలు


కాసేపు మెట్లెక్కి అలసి…కూర్చుని…లేచి మళ్లీ వెళుతున్నప్పుడు…ఒక పాతికేళ్ల అబ్బాయి కాళ్లు కష్టంగా కదిలిస్తూ మెట్లెక్కుతున్నాడు. ఏ ఊరు అని అడిగితే కన్నడలో సమాధానం చెప్పాడు. కాసేపు కన్నడలో మాట్లాడుకుంటూ అతడితో పాటు నెమ్మదిగా మెట్లెక్కాను. ఊరు కర్ణాటక చిత్రదుర్గ. పేరు లోహిత్. ఆరేళ్ల వయసప్పుడు లారీ టైర్ అతడి ఎడమ కాలును తొడదాకా ఛిద్రం చేసింది.

అక్కడిదాకా కాలును తీసేశారు. తరువాత రెండేళ్లకు కృత్రిమ కాలును అమర్చారు. ఎప్పటినుండో తిరుమల మెట్లెక్కాలని ఉందట. నలుగురు మిత్రులతో కలిసి మెట్లెక్కుతున్నాడు. లోహిత్ భక్తి నడక ముందు నా నడక ఏపాటి?

రాయి మీద రాయి

Devotees
తిరుమల నడక దారిలో భక్తులు రాయి మీద రాయి పేర్చడం ఒక నమ్మకం. ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలియదు. ఈ ఆచారానికి ఎక్కడా శాస్త్ర ప్రమాణం లేదు. అలా రాయి మీద రాయి పెడితే ఇల్లు మీద ఇల్లు కడతారని భక్తుల నమ్మకం. మెట్లెక్కుతున్న ప్రతిసారీ నేను కూడా రాయి మీద రాయి పెట్టి వస్తుంటాను.

రాళ్ళన్నీ వెంకన్నవే. అలా పెట్టి మొక్కుకుంటే ఆయన కరిగి మనకు ఇళ్లు కట్టి ఇస్తున్నాడేమో? బంగారు పాత్రలను వద్దని తోమని పళ్ళాల్లో మట్టి పెంకులో పెరుగన్నం తినే వెంకన్న…మనం పేర్చే రాళ్లను భవనాలుగా ఎందుకు మార్చలేడు?

కొమ్మకో ముడుపు

నడకదారిలో చెట్ల కొమ్మలకు ముడుపులను కట్టడం కూడా ఒక ఆనవాయితీ. పసుపు లేదా ఎరుపు వస్త్రంలో ఒక కాగితం మీద తమ కోరికను రాసి…ముడి వేసి…కొమ్మకు కడతారు. నేరుగా వెంకన్నకు చెప్పుకోలేనివారు ఇలా కొమ్మల ద్వారా రాయబారం నడుపుతున్నారు.

కొందరు కొమ్మలకు గాజులను కడతారు. అలా కడితే అమ్మవారు తమ పసుపు కుంకుమలను భద్రంగా కాపాడుతుందని భక్తుల నమ్మకం.

తిరుమలలో లేపాక్షి
మెట్లెక్కి పైకెళ్ళగానే తిరుమలలో వెంకన్న కంటే ముందు నాకు లేపాక్షి సర్కిల్ కనిపిస్తుంది. మా ఊరి పేరు వెంకన్న ముందు వెలుగుతూ ఉన్నందుకు పులకిస్తూ...లేపాక్షి నందిని వెంటబెట్టుకుని తిరుమల నాలుగు మాడల వీధుల్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

Devotees

వందల మైళ్ళ దూరం నుండి వచ్చి ఎండల్లో, వానల్లో గదులకోసం, దర్శనాల కోసం గంటలు, రోజులు వేచి ఉండే సామాన్య భక్తులతో పోలిస్తే…విమానం రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్లి…మెట్లెక్కే నా భక్తి ఏపాటి?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

హనుమ జన్మస్థలి మీద స్వాముల వీధిపోరాటం

Also Read :

ఆధునిక ధర్మ సూక్ష్మం

RELATED ARTICLES

Most Popular

న్యూస్