Allu Arjun signed as brand ambassador of Sri Chaitanya
పాపం!
శ్రీ చైతన్య కష్టం పగవాడయిన నారాయణకు కూడా రాకూడదు. కొన్ని శతాబ్దాల యావత్ తెలుగు విద్యా చైతన్యాన్ని దిగమింగి…ఎవరూ ఊహించనంతగా ఎదిగిన శ్రీ చైతన్య లేని రెండు తెలుగు రాష్ట్రాలను ఊహించలేం. శ్రీ చైతన్యకు ముందుది చదువు సంధ్యల్లేని పాతరాతి యుగం. శ్రీ చైతన్య తరువాతది చదువులు వెల్లివిరిసిన స్వర్ణయుగం. అలాంటి హిమాలయోత్తుంగ చైతన్య తనను తాను తగ్గించుకుని ఒకానొక సినిమా హీరోను బ్రాండ్ అంబాసడర్ గా పెట్టుకోవడమా?
శ్రీ చైతన్యకు మనం ఏమి తక్కువ చేశామని?
శ్రీ చైతన్య కాలేజీలు కోళ్ల ఫారాలకంటే హీనమని మనమేమీ అవమానించలేదే?
శ్రీ చైతన్య హాస్టళ్లలో అన్నం సున్నంలా ఉంటుందని మన పిల్లలేమీ బాధపడలేదే?
వచ్చే వంద ర్యాంకుల ఎర వేసి లక్షల మందిని చదువుల మహా జూదంలోకి శ్రీ చైతన్య దించిందని మనమేనాడూ ఆరోపించలేదే?
ఎవరికో వచ్చిన ర్యాంకులను శ్రీ చైతన్య కోట్లకు కోట్లు పెట్టి కొని తన ఖాతాలో వేసుకుంటోందని లోకం కోడై కూస్తున్నా మనమేమీ నమ్మలేదే?
శ్రీ చైతన్య ర్యాంకుల పిల్లల ప్రకటనలు మమ్మల్ను ఎంతగా ఊరించేవి? మన పిల్లల ఫోటోలు కూడా అలా వస్తాయనుకునే కదా మనం లక్షల ఫీజులు కట్టి శ్రీ చైతన్యలో మన పిల్లలను కట్టేసి వచ్చాము? ఇప్పుడు ఆ స్థానంలో సినిమా హీరో వచ్చి మన పిల్లలను వెనక్కు తోసేసే అధికారం శ్రీ చైతన్యకు ఎవరిచ్చారు?
డబ్బు మాది. చదువు మాది. శ్రమ మాది. ర్యాంకులు మావి. క్రెడిట్ సినిమా హీరోకా?పోనీ…
ఆ హీరో ఏనాడయినా జె ఈ ఈ అడ్వాన్స్ కోచింగ్ కు అడ్వాన్స్ అయినా కట్టాడా? చదువులతల్లి మురిసిపోయేలా డిగ్రీలకు డిగ్రీలు పూర్తి చేసి విద్యా వినయ సంపదతో తుల తూగే స్ఫూర్తి ప్రదాతా?
ఇన్ని దశాబ్దాలుగా ర్యాంకులు తెచ్చుకున్న మా పిల్లల ఫోటోలు వేసి…ఇప్పుడు ఒకటి ఒకటి ఒకటి అని అంత పెద్ద ఒకటిని కాలితో తంతూ ఆ సినిమా హీరో నిలుచుని మా పిల్లలు తెరమరుగయితే మా గుండె రగిలిపోదా?
మరీ ఇంత అన్యాయమా?
ఇంత అవమానమా?
ఈ దేశంలో ధర్మచైతన్యం ఒంటి కాలి మీద అయినా నడవడం లేదా?
ఎవరూ అడిగేవారే లేరా?
యువరానర్!
డిస్ క్లైమర్:-
సినిమా హీరో 2021 బ్యాచ్ శ్రీ చైతన్య ఇంటిగ్రేటెడ్ అండమాన్ సెల్ సెల్ఫ్ క్వారంటైన్ ఆఫ్ లైన్, ఇన్ఫినిటీ లెర్న్ లాంగ్ టర్మ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆన్ లైన్ బ్యాచ్ అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ క్రాష్ కోర్స్ చేసి ఐ ఐ టీ మొదటి ర్యాంకు సాధించి ఉంటే అన్ని ఒకట్ల పక్కన ఆయన్నే పెట్టాలి.
కొసమెరుపు:-
కార్టూనిస్ట్ లేపాక్షి వ్యాఖ్య ఇది.
“ఇంత బిజీ యాక్టర్ అయి ఉండి…పైగా ఈ వయసులో ఐ ఐ టీ ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే మాటలు కాదు!”
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: