Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మీరు మాట్లాడలేరు… కనీసం సంజ్ఞలతోనూ చెప్పలేని పక్షవాతం ఆవహించిన చచ్చుబడిపోయిన శరీరస్థితి… మరి మీ భావాన్నెలా ప్రకటించాలి..? హౌ…? ఇదిగో ఈ ప్రశ్నే ఆర్నవ్ కపూర్ ను ఆలోచింపజేసింది. “ఆల్టర్ఈగో” తయారీకి పురిగొల్పింది.

మెదట్లో పుట్టే ఆలోచలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యవస్థతో కంప్యూటీకరించి… ఇతరులకు ఆ భావమేంటో స్పష్టం చేయగల్గితే..? అదే.. ఇప్పుడు ఆర్నవ్ కపూర్ నూతన సృష్టైన ‘ఆల్టర్ఈగో’.

మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోస్ట్ డాక్టరేట్ స్కాలర్ ఢిల్లీకి చెందిన ఆర్నవ్ కపూర్. ఆయన ఆల్టర్ఈగో ఇప్పుడు టైమ్స్ గుర్తించిన జాబితాలో ప్రపంచంలోనే వంద అద్భుతమైన పరిశోధనల్లో ఒకటి. ఇది కదా యువత ఆలోచించాల్సిన తీరూ.. స్థాయీ…?

స్టీఫెన్ విలియమ్ హాకింగ్… ఈ ప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తనెరుగని జగమా ఇది…? అయితే ఇప్పుడాయనను మనమోసారి మననం చేసుకోవాలి… ఆర్నవ్ ఆల్టర్ఈగో గురించి అరటిపండొల్చి నోట్లో పెట్టినట్టు తెలుసుకోవాలంటే! హాకింగ్ శరీరం చాలావరకూ చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ… దానికి అమర్చిన సంభాషణలను ఉత్పత్తి చేసే పరికరాన్నుపయోగించి సంభాషించేవాడు.

ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరబడి శరీరభాగాలు చచ్చుబడిపోయినా… కృష్ణబిలాలపై పరిశోధన చేసిన స్టీఫెన్ విలియం హాకింగ్ స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ స్టోరీకి ఓ మంచి ఉదాహరణ.

మన ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఆర్నవ్ కపూర్ తన సోదరుడు శ్రేయాస్ తో పాటు… MIT మీడియా ల్యాబ్‌లోని తోటి పరిశోధకులతో కలిసి ప్రయోగాత్మకంగా ఓ మైండ్ రీడింగ్ హెడ్ సెట్ ను రూపొందించాడు. దానిపేరే మనం మొదట చెప్పకున్న ‘ఆల్టర్ఈగో’.

ఏంటీ దీని ప్రత్యేకత అంటారా..?

నరాల బలహీనతతో పాటు… శరీరంలో సరిగ్గా పనిచేయని కొన్ని అవయవాల సమూహంగా చెప్పుకునే సెర్రిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడే వారు పూర్తిగా చచ్చుబడిపోయినప్పుడు… కనీసం వారేం చెప్పదల్చుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో… వారి మెదట్లో పుట్టే ఆలోచనలను చదివి..

ఆ ఆలోచనలనే మనకు స్పష్టమైన భావంగా రూపాంతరం చేసి అందించగల్గే వినూత్న పరికరమే ఆర్నవ్ కపూర్ “ఆల్టర్ఈగో”.

ఉదాహరణకు ఎప్పుడో గతంలో కద్రి గోపాలనాథ్ స్యాక్సాఫోన్ వాద్యకచేరీ విన్నప్పుడు కల్గిన అనుభూతిని గురించి ఓ సెర్రిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నవారు చెప్పదల్చుకున్నారే అనుకుందాం! వారి మెదట్లో ఉన్న ఆలోచనలను సదరు ఆర్నవ్ కపూర్ అండ్ టీం తయారు చేసిన హెడ్ సెట్ తో కూడిన ఆల్టర్ఈగో అనే పరికరంలోని సెన్సార్స్ గ్రహించడంతో పాటు… చెప్పాలనుకునే విషయాన్ని ముఖకవళికలు, లోపలి వోకల్ కార్డ్స్ కదలికలు వంటివాటిని కూడా సంగ్రహించుకుని కంప్యూటర్ ద్వారా అనుసంధానమై.. స్పీకర్స్ ద్వారా ఇతరులకు చేరవేయడమే ఈ పరికరం ప్రత్యేకత.

దాదాపు 92 శాతం సదరు రోగపీడిత వ్యక్తులు ఏం చెప్పదల్చుకున్నారో దాన్ని విశ్లేషించే పరికరం కాబట్టే…

ఇప్పుడీ ఆల్టర్ఈగోను ప్రపంచంలోని వంద ఉత్తమ పరిశోధనల్లో ఒక్కటిగా టైమ్స్ గుర్తించింది.

దీనివల్ల నరాలు చచ్చుబడిపోయి సమాజంలో తమ పాత్రేంటని తెలియని మనోవేదన పడేవారికి… ఇదిగో చిమ్మచీకట్లో చిరుదీపం ఆర్నవ్ కపూర్ ఆల్టర్ఈగో!!

వాణిజ్యపరంగా ఇంకా మార్కెట్ లో అందుబాటులోకి రాని ఈ ఆల్టర్ఈగో… ఇప్పుడిప్పుడే కొన్ని ఆసుపత్రుల్లో రోగులకు ఎలా పనిచేస్తుందో పరీక్షీస్తున్న దశలో ఉందట! అమియోట్రోఫిక్ ల్యాటరల్ స్కెర్లోసిస్ వంటి వ్యాధుల బారినపడి.. వారనుకున్న విషయాలను కమ్యూనికేట్ చేయలేని వారి కోసం ఈ పరికరం ఉపయోగపడనున్నట్టు మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెబ్ సైట్ పేర్కొంటోంది.

అనుకున్నట్టుగా ఈ ఆల్టర్ ఈగో అనే పరికరం మార్కెట్ లోకి అందుబాటులోకొస్తే మాత్రం.. కచ్చితంగా ఎంతో మేధస్సుండి ఏమీ చేయలేని మరెందరో స్టీఫెన్ హాకింగ్స్ ను ఈ ఆల్టర్ఈగో మనకు పరిచయం చేయడం మాత్రం ఖాయమేమో!! సో ఆర్నవ్… మీరూ, మీ బృందం ముమ్మాటికీ అభినందనీయులు… నేటి యువతకు సృజనాత్మకత విషయంలో నిజంగా ఆదర్శప్రాయులు.

-రమణ కొంటికర్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com