Without Power: సిఎం జగన్ పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా తప్పు బట్టారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బాబు పర్యటన సందర్భంగా సిఎం జగన్ పాలనకు అనర్హుడని, వెంటనే అయన గద్దె దిగాలని చంద్రబాబు చెప్పడంపై రాంబాబు మండిపడ్డారు. బాబు అధికారం కోసమే ఆరాట యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘’151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి అనర్హుడట…23 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న వ్యక్తి అర్హుడట, తక్షణం తాను అధికారంలోకి రావాలత’ అని బాబుపై విమర్శనాస్త్రం సంధించారు.
మానవులు ఆక్సిజన్ లేకపోతే ఎక్కువ కాలం బతకలేరని, చంద్రబాబు అధికారం లేకపోతే బతకడం సంగతి దేవుడెరుగు, పిచ్చెక్కి పోతారాని, అసలు అధికారం రాదనీ తెలిసి మరింత గంగవెర్రులెత్తుతున్నారని దుయ్యబట్టారు. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో, ఏదో మాట్లాడుతూ ఊగిపోతున్నారన్నారు.
ఏపీ లంక మాదిరి అయిపోతుందని బాబు అంటున్నారని… త్రేతాయుగంలో రావణ సంతతి శ్రీలంకలో పుడితే, కలియుగంలో ఏపీలో పుట్టినట్లున్నారని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్న వాడు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. రాయలసీమలో తిరుగుతున్న చంద్రబాబు…ఆ ప్రాంతానికి ఏం చేశాడని ప్రశ్నించాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ, ఈడీలు ఈ రాష్ట్రం లో అడుగు పెట్టడానికి లేదు అని చెప్పిన విషయం చంద్రబాబు మర్చిపోయాడా? టీజీ వెంకటేష్ దగ్గర ఎంత తీసుకుని రాజ్యసభ టిక్కెట్ ఇచ్చావు? నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చావు? మేము ఇస్తే తప్పు…తను ఇస్తే ఒప్పా? సుజనా చౌదరి, సీఎం రమేష్ మేధావులు అని రాజ్యసభకు పంపించావా? అని ప్రశ్న వర్షం కురిపించారు. టిక్కెట్లు కొనే, అమ్మే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని, ఓటుకు నోటుతో కొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి పారిపోయి విషయం గుర్తుంచుకోవాలన్నారు.
Also Read :భూ కబ్జాదారులూ ఖబడ్దార్: బాబు హెచ్చరిక