Thursday, March 28, 2024
HomeTrending Newsబాబు రిటర్న్ గిఫ్ట్ వెన్నుపోటు: సిఎం జగన్

బాబు రిటర్న్ గిఫ్ట్ వెన్నుపోటు: సిఎం జగన్

ఎన్టీఆర్ పేరును తాము  ఉచ్ఛరించడం చంద్రబాబుకు నచ్చదని, బాబు ఎన్టీఆర్ పేరు పలకడం స్వయంగా ఎన్టీఆర్ కే ఇష్టం ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్ల బాబు కంటే ఎక్కువ గౌరవం తమకే ఉందని, తాను ఏనాడూ ఆయన్ను గురించి తక్కువగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసుకోకుండా సభలో టిడిపి సభ్యులు నిరసన తెలపడం సరికాదన్నారు. తాను పాదయాత్ర సమయంలో జిలాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం పేరు పెట్టామని గుర్తు చేశారు.

బాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే మరి కొన్నాళ్ళపాటు ఎన్టీఆర్ సిఎంగా కొనసాగి ఉండేవారని, అసలు బాబు సిఎం అయ్యేవాడే కాదని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ ను వాడు, వీడు అంటూ మాట్లాడిన మాటలు అందరం చూశామని చెప్పారు.  బాబుకు ఎన్టీఆర్ పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే… దానికి రిటర్న్ గిఫ్ట్ గా వెన్నుపోటు పోడిచారన్నారు.

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడంలో సహకరించిన ఎందరికో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు ఇప్పించే స్థితిలో ఉండే బాబు ఆయనకు భారతరత్న అవార్డు ఎందుకు ఇప్పించలేకపోయారని  సిఎం ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించానని చెప్పుకునే బాబు ఈ పని ఎందుకు చేయలేకపోయారని అడిగారు.

104, 108, ఆరోగ్యశ్రీ పథకాల సృష్టి కర్త తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ అని సిఎం అభివర్ణించారు. వృత్తిరీత్యా కూడా ఆయన ఎంబిబిఎస్ వైద్యుడని, వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సంస్కర్త అని పేర్కొన్నారు. టిడిపి పుట్టక ముందే  ఏపీలో 8మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే వైఎస్ హయాంలో మరో మూడు శ్రీకాకుళం, ఒంగోలు, కడపల్లో ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత తమ హయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు కొత్తగా నెలకొల్పుతున్నామని చెప్పారు. అంటే ఏపీలో మొత్తం 28 కాలేజీలు ఉంటే వాటిలో 20 వైఎస్, ఆయన కుమారుడినైన తన హయాంలో వచ్చాయన్నారు. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్ల సంఖ్య 3118కు పెంచుతున్నామన్నారు.

ఆరోగ్య ఆసరా అందిస్తున్నామని, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, మూడేళ్ళుగా 40,500 ఖాళీలను వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేశామని , అక్టోబర్ లోపు మరో నాలుగువేల మందిని నియమించే ప్రక్రియ చేపట్టామన్నారు. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సమంజసమని,  ఇది ఎవ్వరినో అగౌరవపరిచే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. బిల్లును ఆమోదించాల్సిందిగా సభకు సిఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం పేరు మార్పు చేస్తూ తీసుకు వచ్చిన బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.

Also Read: అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్