Monday, May 20, 2024
HomeTrending Newsఆటోడ్రైవర్లకు మేలుచేసిన ప్రభుత్వం మాదే: జగన్

ఆటోడ్రైవర్లకు మేలుచేసిన ప్రభుత్వం మాదే: జగన్

దేశ చరిత్రలోనే క్యాబ్, ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం తమదేనని సగర్వంగా చెప్పగలుగుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు చలాన్ల పేరుతో వేధిస్తున్నామని ఆరోపించడం ఆశ్చర్యకరమన్నారు. మంచి చేసే చెట్టు మీదనే, పండ్లు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయని అన్నట్లుగా ఇంత మంచి చేస్తున్న తమపై అపవాదులు వేయడం సరికాదన్నారు. రెండేళ్ళ పాలనలో 95 శాతం హామీలు నేరవేర్చామని మనం చెబుతుంటే 95 అన్యాయాలు చేశారంటూ వారు కరపత్రం విడుదల చేయడం, దానిలో ఈ పతాకాన్ని కూడా పేర్కొనడం సిగ్గుచేటన్నారు.

‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కింద వరుసగా మూడో ఏడాది ఆర్ధిక సహాయాన్ని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యుటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశారు.  పాదయాత్ర సమయంలో… నాటి ప్రభుత్వం పెనాల్టీల పేరుతో బాదుతున్నారని, ఫిట్ నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఒకేసారి 10 వేల రూపాయలు ఖర్చు అవుతోందని, ఇది భారంగా మారిందని  క్యాబ్, ఆటో డ్రైవర్లు తన దృష్టికి తెచ్చారని సిఎం వివరించారు. మే 14న ఏలూరు సభలో ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చామని జగన్ గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ‘వైఎస్సార్ వాహన మిత్ర’  పథకాన్ని ప్రవేశ పెట్టామని,  ఈ ఏడు 2,48,468 మంది అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు 248 కోట్ల 47 లక్షల రూపాయలు సహాయంగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామని, ఆటో, క్యాబ్ లు కొనుక్కున్నవారు, యాజమాన్య హక్కులు బదలాయించుకున్నవారు 42,932 మంది ఈ ఏడు కొత్తగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సిఎం వివరించారు. వాహన మిత్ర పథకం ద్వారా ఈ మూడేళ్ళలో 759 కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు ముఖ్యమంత్రి.  లబ్దిదారుల్లో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారని వెల్లడించారు.

ఆటోలు, ట్యాక్సీలు తమ వాహనాలను మంచి కండీషన్లో ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని డ్రైవర్లకు సిఎం హితవు పలికారు, మీ కుటుంబాలు, మీ వాహనాల్లో ప్రయాణించేవారి కుటుంబాలు కూడా బాగుండాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. పురుషుల కంటే మహిళా డ్రైవర్లు వాహనాలను నిబంధనలు లోబడి నడుపుతున్నారని ఆర్టీయే అధికారులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్