Thursday, April 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆక్సిజన్ కొరత అధిగమిస్తాం : డిప్యూటి సిఎం

ఆక్సిజన్ కొరత అధిగమిస్తాం : డిప్యూటి సిఎం

రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ఎంత చేసినా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 26 వేల ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదన్నారు.

మొదటి దశ కంటే రెండో దశలో కోవిడ్ విస్తరణలో వేగం, వైరస్ ఉధృతి అధికంగా వుందని అందుకే త్వరగా వ్యాప్తి చేడుతోందని నాని వివరించారు. రాష్ట్రానికి 591 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారని దాన్ని 910 మెట్రిక్ టన్నులకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాశారని పేర్కొన్నారు, ప్రతి జిల్లలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కొవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ మంగళగిరిలో సమావేశమైంది. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ వృథా అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 49 మినీ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీరే అవకాశముందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.

కన్నబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొవిడ్ కేర్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 15 వేలకు పైగా బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను అడ్డుకోవడం వల్ల కలిగే ఇబ్బందులపై తెలంగాణా ప్రభుత్వంతో చర్చించామన్నారు. ప్రస్తుతం తెలంగాణా బోర్డర్ల వద్ద ఏపీ అంబులెన్స్ లను అడ్డుకోవడం లేదన్నారు. కరోనా నివారణకు ఒళ్లంతా ఆవు పేడ పూసుకోవాలని, ముక్కులో ఉల్లి రసం వేసుకోవాలని….సూచిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. శాస్త్రీయమైన, నిపుణులు సూచించే పరిష్కార మార్గాలనే పాటించాలని మంత్రి కోరారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సేవలు పొందాలని మంత్రి కన్నబాబు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్