Sunday, January 19, 2025
HomeTrending Newsదూసుకొస్తున్న అసని తుపాను

దూసుకొస్తున్న అసని తుపాను

Asani : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరికొద్ది గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల ధాటికి పంటల తీవ్రంగా దెబ్బతిన్నాయి. పిడుగులు పడి పలువురు మృతిచెందారు.ప్రస్తుతం ఇది ఒరిస్సాలోని పురి పట్టణానికి ఆగ్నేయంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ రేపటి (మే 10వ తేదీ)వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని వివరించింది. అసని గత 6 గంటలుగా గంటకు 14 కిమీ వేగంతో కదులుతోందని వివరించింది. ఈ తుపాను ప్రభావంతో రేపటి నుంచి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మే 11వ తేదీన కూడా ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. మే 12న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అసని ఈ నెల 12వ తేదీ నాటికి వాయుగుండంగా బలహీనపడుతుందని వివరించింది. అప్పటివరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తాజా బులెటిన్ లో హెచ్చరించింది.

అసని పేరు శ్రీలంక దేశం సిఫారసు చేసినది కాగా సింహాల భాషలో అసని పదానికి అర్థం… ఆగ్రహం, కోపం

RELATED ARTICLES

Most Popular

న్యూస్