India-England Test: ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ కు ముందు లీసెస్టర్ షైర్ కౌంటీ తో జరిగనున్న నాలుగురోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరమయ్యాడు. ఈనెల 16న ఇంగ్లాండ్ బయల్దేరిన భారత జట్టుతో అశ్విన్ వెళ్ళలేదు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రోటోకాల్ పూర్తయిన తర్వాత లండన్ వెళ్లనున్నాడు. దీనితో శుక్రవారం నుంచి నాలుగురోజుల పాటు జరిగే ప్రాక్టీసు మ్యాచ్ కు అందుబాటులో ఉండడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తో పాటు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇండియా జట్టు గత జూలై లో ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్ళింది. న్యూ జిలాండ్ తో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ మొదలైంది. మొదటి టెస్ట్ డ్రా గా ముగియగా, రెండు, నాలుగు టెస్ట్ మ్యాచ్ ల్లో ఇండియా , మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాయి. కోవిడ్ కారణంగా మాంచెస్టర్ లో జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దయింది, దీనితో ఇండియా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఐసిసి నిబంధనల ప్రకారం సిరీస్ లో మ్యాచ్ రద్దయితే మళ్ళీ వీలును బట్టి ఆ మ్యాచ్ ను జరపాలి, దీనితో ఈ మ్యాచ్ ను జూలై 1నుంచి 5వరకూ బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
మొదటి విడతలో ఆటగాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళగా రోహిత్ శర్మ రెండ్రోజుల వ్యవధితో జట్టుతో చేరాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి 20సిరీస్ లో పాల్గొన్న అనంతరం కోచ్ ద్రావిడ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు మూడో విడతగా బయల్దేరి వెళ్ళారు. అశ్విన్ మీ వీకెండ్ లో వెళ్లనున్నాడు.
మరోవైపు గాయం కారణంగా కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ను తీసుకున్నారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉండడంతో వారిలో ఎవరైనా గాయపడితే అప్పుడు మయాంక్ ను లండన్ పంపాలని బిసిసిఐ నిర్ణయించింది.
ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ తో పాటు మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ ఇంగ్లడ్ తో ఆడనుంది.
పొట్టి ఫార్మాట్ కోసం జట్టును ఈ వారం ఎంపిక చేయనున్నారు.
Also Read : ఆ వ్యాఖ్యలు కుంగదీశాయి: అశ్విన్ ఆవేదన