Wednesday, February 28, 2024
HomeTrending NewsPakistan: నవాజ్ షరీఫ్ ఆగమనం...పాకిస్థాన్ రాజకీయాలు

Pakistan: నవాజ్ షరీఫ్ ఆగమనం…పాకిస్థాన్ రాజకీయాలు

పాకిస్థాన్ లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి) – పాకిస్థాన్ ముస్లిం లీగ్(నవాజ్ షరీఫ్)(PML-N) రెండు పార్టీలు కలిసి ఇమ్రాన్ ను ఏకాకి చేసి.. విజయం సాధించాయి. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి రెండు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్దం అయ్యాయి. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

ఈ తరుణంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్… రాజకీయాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రణాలికలు సిద్దం చేసింది. వచ్చే నెల 21వ తేదిన నవాజ్ రాకకు ముహూర్తం ఖరారైంది. నవాజ్  కు ఘనంగా స్వాగతం పలికేందుకు పంజాబ్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ తరపున కమిటీల ఏర్పాటు, లాహోర్ లో నిర్వహించే ఆశేష జనసందోహాన్ని ఉద్దేశించి నవాజ్ షరీఫ్ ప్రసంగించే అవకాశం ఉంది.

నవాజ్ వచ్చాక ఆయనను అరెస్టు చేయకుండా ఆ పార్టీ లీగల్ టీం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. పనామా పేపర్ లీక్… సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. దశాబ్ద కాలంగా లండన్ లో ప్రవాస జీవనం సాగిస్తున్నారు. తాజాగా సోదరుడు షబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉండటంతో పరిస్థితి కొంత చక్కబడింది.

రాబోయే ఎన్నికల్లో చక్రం తిప్పి పార్టీని మంచి మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చేందుకు నవాజ్ తిరిగివస్తున్నారు. ఆయన రాకపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నవాజ్ హయంలోనే కార్గిల్ యుద్ధం జరగటం, ఆఫ్ఘన్ తో విభేదాలు పొడసూపటం…అప్పటి సైన్యాధిపతి ముషారఫ్ ను గద్దె దించేందుకు కుట్ర తదితర వ్యవహారాలతో దేశ ప్రతిష్ఠ మంట కలిపారని విమర్శలు ఉన్నాయి. సౌదీ రాజుతో కలిసి వ్యాపారాలు చేసి లక్షల కోట్ల సొమ్ము విదేశాల్లో దాచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం దేశం దివాళా అంచులో ఉంది. దేశంలోని నలభై శాతం జనాభా అర్థాకలితో రోజులు వెళ్లదీస్తున్నారు. ఆర్థిక పరిస్థితి చక్క దిద్దేందుకు సైన్యం రంగంలోకి దిగింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లో దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని సైన్యం కౌలుకు తీసుకోబోతున్నది. దీనిలో గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లను సాగు చేస్తుంది. వీటిని అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్ము వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుంది. మిగిలిన సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సైన్యం చెప్తున్నది.

అయితే సైన్యం గ్రామీణ పేదల హక్కులను మరింత ఉల్లంఘించబోతున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంతర్జాతీయంగా రుణాలు పుట్టడం లేదు. చైనా పెట్టుబడులు మందగించాయి. చైనా కంపనీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

ఈ దశలో మియా నవాజ్ షరీఫ్ పాక్ ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దేందుకు ఎలాంటి విధానాలు చేపడుతారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్