ఆసీస్ ఫోబియా మరోసారి భారత మహిళా క్రికెట్ జట్టును వెంటాడింది. టి 20 వరల్డ్ కప్ సెమీస్ లో ఆసీస్ చేతిలో ఇండియా 5 పరుగులతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ 172 పరుగుల భారీ స్కోరు చేసింది. బెత్ మూనీ-54 (37బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సర్); మెగ్ లన్నింగ్-49 నాటౌట్ (34 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) ; గార్డ్ నర్-31 (18 బంతుల్లో 5 ఫోర్లు); హెలీ-25 పరుగులతో సత్తా చాటారు. ఇండియా బౌలర్లలో శిఖా పాండే2, దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇండియా 28 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ -9; స్మృతి మందానా-2; యస్తికా భాటియా-4 (రనౌట్) రన్స్ మాత్రమే చేసి వెనుదిరిగారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్-జేమైమా రోడ్రిగ్యూస్ లు స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ 69 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయంపై ఆశలు రేకెత్తించారు, 24 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసిన రోడ్రిగ్యూస్ 11వ ఓవర్లో ఔటైంది. హర్మన్ కూడా వేగంగా ఆడి 34 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్సర్ తో 52 పరుగులు చేసి 15వ ఓవర్లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యింది. ఈ వికెట్ తో ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో దీప్తి శర్మ 20 పరుగులు చేసినా ఉపయోగం లేకపోయింది. 16వ ఓవర్లో డార్సీ బ్రౌన్ కేవలం ఒక్కపరుగు మాత్రమే ఇవ్వగా, 19 వ ఓవర్లో గార్డ్ నర్ నాలుగు పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టడం ఇండియా అవకాశాలను దూరం చేసింది.
ఆసీస్ బౌలర్లలో గార్డ్ నర్, డార్సీ బ్రౌన్ చెరో రెండు; మేగాన్ స్కట్, జోనాస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.
31 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టి ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన ఆష్లీ గార్డ్ నర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.