Thursday, May 30, 2024
HomeTrending Newsగవర్నర్ కు తెలియకుండానే మార్చారు: బాబు

గవర్నర్ కు తెలియకుండానే మార్చారు: బాబు

హెల్త్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కు తెలియకుండానే ఆ సంస్థకు పేరు మార్చడం గవర్నర్ వ్యవస్థకే అవమానమని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కనీసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా తీసుకోలేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజ్ భవన్  లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలుసుకుంది. అనతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కావాలంటే మరో యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి వారికి ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు గానీ ఉన్న పేరు తీసివేయడం దుర్మార్గమని, ఎన్టీఆర్ పేరు మళ్ళీ పెట్టేవరకూ తమ పోరాటం ఆపబోమని హెచ్చరించారు. పేరు మార్పుపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, బిల్లు పాస్ అయ్యిందా అని ప్రశ్నించారని బాబు వెల్లడించారు.

తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ నుంచి మహాప్రస్థానం వరకూ వైద్య ఆరోగ్య వ్యవస్థలో పటిష్టమైన మార్పులు తమ హయాంలో తీసుకు వచ్చామన్నారు. ఇపుడు ఆస్పత్రుల్లో కనీసం తిండి పెట్టడం లేదని,  సరైన మందులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ తీసుకు వస్తే దాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. సిఎం జగన్ చట్ట సభల్లో కూడా అబద్ధాలు చెబుతున్నారని, ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కాదు కదా రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదన్నారు.

రాజకీయాల్లో అంశాలు వచ్చినపుడు బలంగా పోరాటం చేయవచ్చని, కానీ వ్యక్తిగతంగా తీసుకోకూడదని సూచించారు. హైదరాబాద్ లో చెన్నారెడ్డి మెమోరియల్ పార్క్, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ లకు తాను నామకరణం చేశానని గుర్తు చేశారు. వైఎస్ షర్మిల కూడా ఈ పేరు మార్పును వ్యతిరేకించిన విషయాన్ని బాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ లాంటి ఓ మహా నాయకుణ్ణి అవమానించడం అంటే యావత్ తెలుగు జాతిని అవమానించడమేనని అన్నారు.

Also Read : మా జోలికి వస్తే తాట తీస్తాం:  రామానాయుడు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్