బాసర ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వీసిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సబిత చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు బాసరలో కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాసరలో గోడ దూకి విద్యార్థులను రెచ్చ గొట్టి రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీసీతో ఏవైనా ఇబ్బందులు ఉంటే విద్యాశాఖ మంత్రిగా తనకు ఫిర్యాదు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అధికారులతో రివ్యూ అనంతరం మంత్రి సబితా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.
మరోవైపు బాసర ఆర్జీయూకేటీలో రెండోరోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వైపుకు దూసుకొచ్చారు. మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది. అకాడమిక్, వసతిగృహం సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కెటి రామారావు భరోసా ఇచ్చారు. బాసర ఆర్జీయూకేటీ సమస్యలపైన స్పందించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసిన విద్యార్థికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో మౌలిక వసతులు పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు లేవనెత్తిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.