Friday, May 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవయసు మాట వినదు!

వయసు మాట వినదు!

Age Factor: ప్రపంచంలో గేటు ముందు కాపలాగా ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికయినా పదవీ విరమణ వయసు ఉంటుంది కానీ…రాజకీయనాయకుల పదవీ విరమణకు వయసుతో నిమిత్తం ఉండదు. దాంతో వార్ధక్యం వల్ల ఏమి మాట్లాడుతున్నారో వినపడని వృద్ధులు, కాలెత్తి నడవలేక వీల్ చెయిర్లో మాత్రమే తిరిగగలిగే కురు వృద్ధులు, అటు ఇటు మనుషుల సాయంతో మాత్రమే నాలుగడుగులు వేయగలిగే అతి వృద్ధులు, ఆసుపత్రి ఐ సి యు లో సెలయిన్ ఎక్కించుకుంటూ, కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చుకుంటూ కాటికి కాళ్లు చాచిన మహా వృద్ధులు, నానా రోగాలతో బతుకీడుస్తున్న నానా వృద్ధులు రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. వారు పోరు. వారు పోతే తప్ప రెండో తరువాత తరానికి అవకాశాలు రావు. ఈలోపు నాలుగో తరం కూడా పుట్టి పెరుగుతూ ఉంటుంది…వారు మాత్రం బోసినవ్వులు కూడా ఉడిగి…బోసి ఏడుపులతో రాజకీయాలను శాసిస్తూ ఉంటారు.

త్రేతాయుగంలో చతుస్సాగర ధరా ముద్రిత కోసల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా అరవై వేల ఏళ్లు నిర్నిరోధంగా పాలించిన తరువాతే…విసుగు పుట్టి…మా పెద్దబ్బాయి రాముడికి పట్టాభిషేకం చేసి…నేను రిటైర్ అవుదామనుకుంటున్నాను…అని దశరథుడు నిండు సభలో చెప్పుకున్నాడు. ఆ ముచ్చట చూడకుండానే పోయాడు. అది వేరే విషయం.

అలాంటి ఆయుస్సు, అవకాశం ఉండి ఉంటే మన రాజకీయ నాయకులు కూడా ఎనభై వేల ఏళ్లయినా కూర్చున్న కుర్చీని వదలకుండా ఉండిపోయేవారు. వెధవది…కలియుగంలో వందేళ్లే ఆయుస్సు అయి చచ్చింది. ఆ బొంద వందలో కూడా బొందిలో ప్రాణం ఉండి చచ్చేది డెబ్బయ్ లేదా ఎనభై ఏళ్ళే అయ్యింది. లేకపోతేనా…ఒక్కొక్కడు లక్ష వత్సరాల అప్రతిహత పదవీ ప్రమాణ స్వీకార ప్రమాణం చేసి పారేసేవాడు!

పద్నాలుగు భువన భాండాల్లోకెల్లా తమ దేశం గొప్పదని అమెరికా అనుకుంటుంది. లోకం ఆ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని అంగీకరించినట్లు కూడా అనుకుంటూ ఉంటుంది. ఎవరి అజ్ఞానం వారికి శ్రీరామ రక్ష. కాబట్టి ఆ విషయం డిబేటబుల్ కాదు. కాబట్టి ఇక్కడ అనవసరం.

అమెరికా సంయుక్త రాష్ట్రాల నలభై ఆరవ అధ్యక్షుడు జో బైడెన్ వయసు 81 సంవత్సరాలు. ఆయనకు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలేమున్నాయో మనకు తెలియదు కానీ…తరచుగా తూలి పడిపోతూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడు అంటే పంచ భూతాలు వణికిపోవాలి. కానీ పెనుగాలికి నిలువెల్లా వణికిపోయేలా చిగురుటాకులా అమెరికా అధ్యక్షులవారు బయట చిరుగాలులకే వణికి పడిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ మేఘ మండలం మీద విహరిస్తుంటే ఆ శబ్దం హోరుకే మిగతా విమానాలు కంపించి దారి తప్పుతూ ఉంటాయి. అలా అమెరికా అధ్యక్షుడు నేల మీద నడుస్తూ ఎందుకో తరచుగా కంపనకు గురవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు కాలు కదిపితే…వేన వేల నిఘా నేత్రాలు డేగ కళ్లతో అనుక్షణం కాపలా కాస్తూ ఉంటాయి. అంతటి నిఘా నేత్రాల మధ్య ఒక్కోసారి ఆయన ఎటు వెళ్లాలో తెలియక అయోమయంగా ఎటో వెళుతున్నారు.

వెనకటి అధ్యక్షుడు ట్రంప్ మీడియా దుంప తెంచడంతో…అమెరికా మీడియాకు బైడెన్ లో బలమయిన నాయకుడు కనిపించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ…సర్వం సహా చక్రవర్తికి తక్కువ కాని బలమయిన అమెరికా అధ్యక్షుడు మెట్లెక్కుతూ జారిపడడం, నడుస్తూ తూలి పడడం, అరగంట ఎండకు తల తిరిగి పడడం, పది మెట్లెక్కగానే పట్టుదప్పడం చూడ్డానికి బాగలేదు.

ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్ కె లక్ష్మణ్ మూడు దశాబ్దాల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో అతి చిన్న పాకెట్ కార్టూన్ లో… ఆసుపత్రి ఐ సి యు లో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధ రాజకీయ నాయకుడు పి ఏ చెవిలో ఏదో చెబుతూ ఉంటాడు. “He still wants to continue in active politics” (ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటున్నాడు) అని కింద వ్యాఖ్య.

ఆర్ కె లక్ష్మణ్ కామన్ మ్యాన్ చూసిన రాజకీయ నాయకుడితో పోలిస్తే…అడపా దడపా…ఏ అమావాస్యకో…పున్నమికో…తూలిపడిపోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటి రెట్లు నయం!

ఒబామాలా తుళ్లి తుళ్లి పడే అమెరికా అధ్యక్షుడిని చూసిన ప్రపంచం…
అదే కళ్లతో తూలి తూలి పడే అమెరికా అధ్యక్షుడిని కూడా చూస్తోంది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్