Thursday, February 22, 2024
Homeసినిమాయూట్యూబ్ ని షేక్ చేస్తోన్న‌ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్

యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న‌ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్

Bheemla ‘Power’: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా న‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె.చంద్ర  తెర‌కెక్కించారు. యువ నిర్మాత‌ సూర్యదేవ‌ర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే తో పాటు ఓ పాట రాయ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రి 25న శివ‌రాత్రి సంద‌ర్భంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 21న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌రించింది. అయితే ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి క‌న్నుమూయ‌డంతో భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. అయితే.. ట్రైల‌ర్‌ను మాత్రం సోమ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు రిలీజ్ చేశారు.

ఇక ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే… రానా పాత్ర‌ధారి అయిన డానియ‌ల్ శేఖ‌ర్ ‘ఏంటి బాలాజీ స్పీడు పెంచావ్’ అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. దానికి ర‌ఘుబాబు క్యారెక్ట‌ర్ ‘ఇది పులులు తిరిగే ప్రాంతమంట బాబు’ అని సమాధానం చెబుతాడు. ‘పులి పెగ్ ఏసుకుని పడుకుంది కానీ స్లోగానే పోనీయ్’ అని రానా చెప్పడంతో పాటు డానియల్ శేఖర్ పాత్రను పరిచయం చేశారు. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర అయిన భీమ్లా నాయక్ ఇంట్రడక్షన్‌ను స్టైల్‌గా, పవర్ ఫుల్‌గా చేశారు.

‘ఎవర్నీ అరెస్ట్ చేశావో తెలుస్తుందా నీకు’ అని భీమ్లా నాయక్‌ను డానియల్ శేఖర్ బెదిరించడానికి ప్రయత్నిస్తే.. భీమ్లా నాయక్ గన్‌ను లోడ్ చేసి టేబుల్ పై పెట్టడం.. అలాగే రావు రమేష్ పాత్రధారి మాట్లాడుతూ ‘నీ ఒంటిపై యూనిఫాం చూసుకుని పొగర్రా నీకు’ అని అంటే భీమ్లా నాయక్ అవునన్నట్లు సైగ చేయ‌డం.. పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకుని వచ్చి బయట ఉన్న జనాల్ని చెదరగొట్టడం.. రానా దగ్గుబాటి కారుని పేల్చేయడం.. ‘ఏం నాయక్ నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా? చూసుకోవాలి క‌దా’ అని నిత్యామీన‌న్ అంటే ‘గొప్ప దానివి దొరికావ‌మ్మా నువ్వు’ అని ముర‌ళీ శ‌ర్మ చెప్ప‌డం.. ఇవ‌న్నీ భీమ్లా నాయ‌క్‌, డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌ల‌తో పాటు సినిమాలో ఇత‌ర పాత్ర‌ధారుల‌ను ప‌రిచ‌యం చేశారు.

రానా, నిత్యామీన‌న్ పాత్ర‌ల మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ అన్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌ను ప‌వ‌ర్ ఫుల్‌గా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ‘తోలు తీస్తా నా కొడ‌కా’ అని విల‌న్స్‌ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చే వార్నింగ్‌.. ‘వైల్డ్ యానిమ‌ల్‌కి క‌ళ్లెం వేసిన‌ట్టు వాడికి యూనిఫాం వేసి కంట్రోల్‌లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫాం తీసేశావ్’ అంటూ ముర‌ళీ శ‌ర్మ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌కు ఇచ్చిన ఎలివేష‌న్ ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్‌ కు  గూస్ బంబ్స్ తెప్పించేలా ఉంది.

ఇలా ట్రైల‌ర్ రిలీజ్ చేశారో లేదో.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ సినిమా పై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్