బీహార్ లో ఈ రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివిధ పార్టీల నుంచి అనేక మందికి అవకాశం దక్కింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి వర్గ విస్తరణలో నితీష్ కుమార్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరిగింది. కొత్త మంత్రులతో గవర్నర్ పఘు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. లాలూ ప్రసాద్ యాదవ్ RJD, కాంగ్రెస్ మరియు జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 30 మంది ఎమ్మెల్యేలను ఈ రోజు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ నుంచి 16 మందికి మంత్రులుగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జెడి(యు) నుంచి 11 మంది మంత్రిపదవులు అలంకరించారు. కాంగ్రెస్ నుంచి అఫాక్ ఆలం, మురారి లాల్ గౌతమ్, HAM నుండి సంతోష్ సుమన్ కూడా ప్రమాణం చేశారు. స్వతంత్ర అభ్యర్థి సుమిత్ కుమార్ సింగ్ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో మంత్రి పదవి దక్కింది. సింగ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.
హోం శాఖను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన వద్దే ఉంచుకోగా వైద్య ఆరోగ్య శాఖను తేజస్వి యాదవ్ కు కట్టబెట్టారు. బీహార్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 36 మంది మంత్రులు ఉండవచ్చు. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉంచారు. తాజా పరిణామాలతో బీహార్ లో మహాఘటబంధన్ కూటమికి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.