బిజెపి గూటి నుంచి ఇక మంత్రులు, ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రసక్తే లేదని సామాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ రోజు లక్నోలో స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా శాసనసభ ఎన్నికల్లో సీట్లు ఆశించి రావొద్దని పేర్కొన్నారు. ఎస్పి ఈ ఎన్నికల్లో బిజెపి ని నిలువరించేందుకు ఇప్పటికే అనేక చిన్న పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంది. ఈ తరుణంలో బిజెపి నుంచి వలసలు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని ముందే ఉహించిన అఖిలేష్ తాజాగా తన వైఖరి వెల్లడించారు.
మరోవైపు సమాజ్ వాది పార్టీతో పొత్తుకు భీమ్ ఆర్మీ నిరాకరించింది. ఈ మేరకు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. భీమ్ ఆర్మీ – ఎస్పి జతకడితే దళిత ఓటు బ్యాంకు గంపగుత్తగా అఖిలేష్ కు అండగా ఉండేది. భీమ్ ఆర్మీ వైఖరిపై స్పందిస్తూ అఖిలేష్.. వారికి ఎవరి నుంచో ఒత్తిళ్ళు వస్తున్నట్టు ఉన్నాయని తేలికగా కొట్టిపారేశారు.
అటు బిజెపి మొదటి, రెండో దశల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 107 మందితో జాబితా విడుదల చేయగా కమలం జాబితాలో 60 శాతం టికెట్లు ఒబిసిలు, మహిళలకే కేటాయించటం కొసమెరుపు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ రోజు లక్నోలో మీడియాతో మాట్లాడుతూ గోరక్ పూర్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రయగ్రాజ్ జిల్లా సిరాతు నుంచి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ రోజు విడుదల చేసిన జాబితాలో 83 మంది పాతవారికి చోటు దక్కగా 21 మంది కొత్తవారికి టికెట్లు ఇచ్చారు.