Bluetooth slippers worth Rs 6 lakh sold to cheat in Rajasthan REET exam
నలభై, యాభై ఏళ్ల కిందటి వరకు పొరపాటున మన కాలు ఎవరికయినా తగిలితే…వెంటనే ఆ కాలు తాకిన చోటే చేత్తో తాకి కళ్లకద్దుకునే వాళ్లం. తప్పయింది. పొరపాటున అలా జరిగింది…క్షమించమని అదొక సంస్కారం. ఇప్పటికీ దీన్ని పాటించేవారున్నారు. చాదస్తంగా మానేసినవారున్నారు.
కాళ్లతోనే కాకుండా చేతులతో, కళ్లతో, అహంకారంతో నడిచేవాళ్లకు ఒళ్లంతా కాళ్లే కాబట్టి…చేతుల్లేకపోవడం వల్ల ఈ సంస్కారానికి సంబంధించిన చర్చే ఉండదు. పొరపాటున స్కూల్ బ్యాగ్, పుస్తకం, లంచ్ బాక్స్ కాలికి తగిలితే…ఆగి చేత్తో తాకి కళ్లకద్దుకోవడం ఒక ఆచారం. చదివే పుస్తకం నెత్తిన పెట్టుకోవాలే కానీ…కాలికి తగలకూడదు. తినే అన్నం బాక్స్ పరబ్రహ్మ స్వరూపం. కాలికి తగలనే కూడదు. చెప్పు కాలు ఇతరులకు, పుస్తకానికి తగలడం మహాపరాధం. కళ్లు నెత్తికెక్కిన వాళ్లకు సహజంగా కాళ్లు కూడా నెత్తికే ఎక్కుతాయి. అది వారి తప్పు కాదు. వారి శరీర నిర్మాణం- అనాటమీ లోపం.
మా చిన్నప్పుడు పది రూపాయల హవాయి చెప్పులే చాలా గొప్ప. వాటి స్ట్రాప్స్ తాళ్లు తేగితే స్ట్రాప్స్ మార్చుకుంటే మళ్లీ ఆరు నెలలు అవే చెప్పులు. ఊరు దాటాలంటేనో, వేసవిలోనో తప్ప మిగతారోజుల్లో చెప్పులు వాడడమే తెలియదు. స్కూల్లో క్లాసు రూమ్ బయటే చెప్పులు వదలాలి. కాలేజీ మెట్లెక్కితే డెబ్బయ్ రూపాయల అత్యంత విలువయిన బాటా చెప్పులు, బెల్ బాటమ్ ప్యాంటు.
వర్షంలో అంతటి విలువయిన చెప్పులు తడిస్తే పాడయిపోతాయనే జ్ఞానం ఉండడంవల్ల నాలుగు చినుకులు పడగానే చెప్పులు చేత్తో పట్టుకుని జాగ్రత్త పడేవాళ్ళం. వర్షంలో గొడుగులు వాడాలన్న విషయమే మాకు నేర్పలేదు. గొడుగులు కొనివ్వలేదు. పుస్తకాల సంచికి ఒక ప్లాస్టిక్ కవర్ కప్పేవాళ్ళం. నెత్తిమీద జుట్టువరకు మరో ప్లాస్టిక్ కవర్. పొరపాటున నెత్తిమీది కవర్ మొహాన్ని కవర్ చేస్తే అంతే సంగతులు. ప్లాస్టిక్ కవర్ కు చిల్లులు పెట్టుకుని ఊపిరాడేలా చేసుకుని కప్పుకోవడం అదొక విద్య.
ఒక్కోసారి హవాయి చెప్పులు టప్ టప్ అని వెనుక కాళ్లనుండి వీపు దాకా చల్లిన బురద న్యాచురల్ మట్టి డిజైన్ గా శోభించేది. హవాయి చెప్పుల్లో పలుచగా ఉన్నవి సర్వసాధారణం. స్పాంజిలా మెత్తగా రెండంగుళాల మందంగా ఉన్నవి మరీ కాస్ట్లీ. పదిహేడు రూపాయలు.
తెలుగులో చెప్పు పదం క్రియ, నామవాచకం. ఏమయ్యిందో సరిగ్గా చెప్పు- అంటే క్రియాపదం. చెప్పు తెగిందిలో చెప్పు నామవాచకం. ఎంత అందమయిన చెప్పులయినా చెప్పులను తిట్లలో వాడడం అనాదిగా ఉంది. చెప్పు తెగుతుంది – అని ఎదుటివారితో అంటే చెప్పుతో కొడతాను అని అర్థం. నీ చెప్పులు మోస్తాను- అంటే నీ బానిసగా పడి ఉంటూ ఏ పనయినా చేస్తాను అని అర్థం.
ఇప్పుడంటే మ్యాచింగ్ చెప్పుల కాన్సెప్ట్ వచ్చి చెప్పులు ఇంట్లో డ్రెస్సింగ్ అద్దం ముందుకు వచ్చాయి కానీ – ఇదివరకు చెప్పులు గడప అవతలే. ఊళ్లో చెప్పులు కుట్టే ముసలాయన ఒకడు చెట్టు కింద జాలిగా ఉండేవాడు. చిల్లులు పడ్డ చెప్పులను, తెగిన చెప్పులను అతను రిపేర్ చేస్తుంటే చూసి తీరాలి. చర్మం ఒడుపు తెలిసిన అతను పాడయిన చెప్పులకు మళ్లీ ప్రాణం పోసేవాడు.
నడిచిన దారిలో మన కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా కాపాడిన చెప్పుల వ్యథను చెప్పినవారు లేరు.
ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా చెప్పులు నడిచిన దారిని కొలిచినవారు లేరు.
చెప్పులు మోసిన మనుషుల కథలు చెప్పినవారు లేరు.
కరోనా కష్టకాలంలో వలసకూలీల్లో కొందరికి ఆ చెప్పులు కూడా లేక వందల మైళ్లు నడిచి కాళ్లు బొబ్బలెక్కుతుంటే- ఆ కాళ్లను చేరలేని చెప్పులు చెప్పుకోలేక ఏడ్చాయి.
వాల్మీకి రామాయణంలో అడవిలో రామ – భరత చర్చోపచర్చలకు ముగింపు చెప్పులే. రాముడు తొక్కి ఇచ్చిన చెప్పులే త్రేతాయుగంలో చతుస్సాగర పర్యంత సువిశాల కోసల రాజ్యాన్ని పద్నాలుగేళ్లు పాలించాయి.
చెప్పులు రాజ్యాన్నే పాలించిన నేల మీద…అవే చెప్పులు ఇక దేనికయినా పనికొస్తాయనుకున్నారేమో! రాజస్థాన్ రాజ్యంలో కాబోయే ఉపాధ్యాయులు తమ ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్షలో హై టెక్ కాపీ కొట్టడానికి ఆ చెప్పులనే వాడారు.
చెప్పుల రెండు పొరల మధ్య బ్లూ టూత్ పరికరాన్ని అమర్చి, దాని వైర్ లెస్ హెడ్ ఫోన్ కనిపించనంత చిన్నది చెవిలో పెట్టుకుని కాపీ కొడుతూ పట్టుబడ్డారు. దొరికినవారు కొందరే. దొరకానివారు ఇంకా ఉండి ఉండవచ్చు. ఈ హై టెక్ కాపీయింగ్ బ్లూ టూత్ ఎంబెడెడ్ చెప్పుల జత అక్షరాలా ఆరు లక్షల రూపాయలు. కొన్నవారు పోలీసులకు దొరికారు. తయారు చేసిన ఆవిష్కర్త పరారీలో ఉన్నాడు. వాడు ఇంకా ఏయే పరీక్షలకు, ఏయే రాష్ట్రాల్లో ఈ కాపీ చెప్పుల సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ను కాపీ పేస్ట్ చేశాడో ఇప్పటికయితే అస్పష్టం.
ఉపాధ్యాయ ఎంపిక ప్రవేశ పరీక్షలో కాబోయే అయ్యవార్లు చేసిన హై టెక్ కాపీయింగ్ ఇది. ఇక వారి శిష్య పరమాణువులు ఎలా తయారవుతారో ఎవరికి వారు ఊహించుకోవచ్చు. ఆవులు చేలో మేస్తే…దూడలు గట్టున మేస్తాయా?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: