Village-Language: జరగని పనులు కొన్ని ఉంటాయి. అవి జగవని చెప్పేవారికీ తెలుసు. వినేవారికీ తెలుసు. కానీ చెప్పేవారు చెబుతూనే ఉంటారు. వినేవారు వింటూనే ఉంటారు. అలా మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దున ఒక చర్చ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. వివాదం కాని వివాదం. చర్చ కాని చర్చ. మహారాష్ట్ర సరిహద్దు సాంగ్లీ ప్రాంతంలో కన్నడ మాట్లాడే 40 గ్రామాలను కర్ణాటకకు తిరిగి ఇచ్చేయాలని కర్ణాటక; అలాగే కర్ణాటకలో మరాఠీ భాష ఎక్కువగా మాట్లాడే బెల్గామ్, కార్వార్, నిపాని ప్రాంతాలను మహారాష్ట్రకు తిరిగి ఇచ్చేయాలని మహారాష్ట్ర ఎప్పుడూ డిమాండు చేసుకుంటూ ఉంటాయి.
దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉండగా మహారాష్ట్ర 40 ఊళ్లను కర్ణాటకకు వెనక్కు ఇచ్చేయడానికి అంగీకరించారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెవుతున్నారు. ప్రస్తుతం ఫడ్నవిస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. నేనలా అనలేదు…సుప్రీం కోర్టులో ఉన్న ఈ వివాదంలో నేనెందుకు కలుగజేసుకుంటాను? అని ఆయన తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. 40 ఊళ్లు కాదు…సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వం…ఇంకా కర్ణాటకలో మాకు రావాల్సినవే రెండున్నర జిల్లాలున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అంటున్నారు.
ఇక్కడే కాదు. దేశంలో, ప్రపంచంలో ఏ సరిహద్దులో అయినా భాష, ఆచార వ్యవహారాలన్నీ కలగలిసి ఉంటాయి. చిత్తూరుకు తమిళనాడు, కర్ణాటక; నెల్లూరుకు తమిళనాడు; అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ లకు కర్ణాటక; ఆదిలాబాద్ కు మహారాష్ట్ర; ఖమ్మానికి ఛత్తీస్ ఘడ్; శ్రీకాకుళానికి ఒరిస్సా…ఇలా చెబుతూ పొతే కొన్ని సరిహద్దుల్లో అంతా కలగలిసి మనమెక్కడున్నామో? ఏ భాష వింటున్నామో కూడా తెలియదు. ఆయా సరిహద్దుల్లో ఆహారపుటలవాట్లు, వ్యాపార, వివాహ సంబంధాలు రెండు రాష్ట్రాల సరిహద్దులను ఎప్పుడో చెరిపేసి ఉంటాయి. అలానే ఉండాలి కూడా.
కడపలో పుట్టి అనంతపురం లేపాక్షిలో పెరిగిన నాకు తెలుగు, కన్నడ సమానంగా వినపడేవి. లేపాక్షి నుండి ఎటు వెళ్లినా కర్ణాటక వచ్చేది. బస్సుల మీద తెలుగుతో పాటు తప్పనిసరిగా కన్నడ ఉండేది. ఇరవై ఏళ్ల వయసులోరాజధాని హైదరాబాద్ తొలిసారి చూశాను కానీ…రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న బెంగళూరుకు ఎన్ని సార్లు వెళ్లానో లెక్కే లేదు. బెంగళూరులో తుంపర పడితే హిందూపురానికి జలుబు చేసేది. దూరదర్శన్, రేడియోల్లో హాయిగా కన్నడ కార్యక్రమాలు చూసేవాళ్ళం. వినేవాళ్లం. బిసిబేళీబాత్, ఉప్పిట్టు, చిత్రాన్న(చిత్రాన్నం), మసరన్న(పెరుగన్నం), అక్కి రొట్టి(బియ్యపు రొట్టె), చౌ చౌ బాత్ అని కన్నడ పేర్లతోనే కన్నడ పదార్థాలను తింటూ పెరిగాము. “బేళూరు గుడియల్లి కేశవ నినదల్లి అనుక్షణ అనుదిన శిలగళు సంగీతవా హాడువే…” పాటలే అనుక్షణం విన్నాం. “ఎల్లో హుడికిదె ఇల్లదె దేవర” అన్న కన్నడ జానపదాల్లో దేవుడిని వెతుక్కున్నాం. “తంబూర మీటిదివ గజ్జెయ కట్టిదవ…” పురందరదాసు భజన కీర్తనలను త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య పదాల్లాగే పాడుకున్నాము.
తెలుగును కన్నడ ఉచ్చారణతోనే మాట్లాడాము. మాట్లాడుతున్నాము. మాట్లాడుతూ ఉంటాము. దానికదిగా ఒక మాండలికం. కాలు తీసి అడుగేస్తే కన్నడ నేల వచ్చే చోట…కన్నడ భాష వినకుండా చెవులు మూసుకుంటారా? కన్నడ రుచులు తినకుండా నాలుక కట్టేసుకుంటారా? కన్నడ బట్టలు కట్టకుండా పారేస్తారా? సరిహద్దుల్లో ఎన్నో బడులు, కాలేజీల్లో మొన్నటివరకు తెలుగును ఒక అప్షనల్ భాషగా కర్ణాటక ప్రభుత్వమే బోధించలేదా?
కర్ణాటకలో బళ్లారి, కోలార్, చిక్ బళాపూర్, తుముకూరు, శివమెగ్గ, బెంగళూరు, రాయచూర్ జిల్లాల్లో లక్షల మంది తరతరాలుగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. 350 ఏళ్లపాటు తిరుగులేని రాజ్యంగా వెలిగిన విజయనగర సామ్రాజ్యంలో తెలుగు, కన్నడ సమానంగా ఉండేవి.
మహారాష్ట్రలో కన్నడ మాట్లాడే 40 ఊళ్లు కర్ణాటకకు ఇచ్చేయాలన్న ముఖ్యమంత్రి బొమ్మయ్ వాదనలో లాజిక్ ఉంటే…ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తెలుగు మాట్లాడే కర్ణాటక జిల్లాలను ఇచ్చేయాలన్న వాదనలో కూడా లాజిక్ ఉంటుంది.
రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సరిహద్దుల్లో అగ్గి రాజేసి…రోజూ అందులో మాటల పెట్రోల్ పోస్తుంటే...మీకు పూట గడుస్తుందేమో కానీ…ఆ సరిహద్దు గీతలను చెరిపి బతుకు గీతాలను పాడుకునే సామాన్యులు ఆ అగ్గిలో మాడి మసైపోతారు.
బొమ్మాయ్ గారూ! మీరు 40 తీసుకోండి.
షిండేగారూ! మీరు కూడా 20 తీసుకోండి.
మాకేమీ అభ్యంతరం లేదు. దానికంటే ముందు మాక్కూడా అదే చేత్తో ఒక ఏడు జిల్లాలు ఇచ్చేయండి. ఒక పనైపోతుంది.
ప్రతి సరిహద్దు రాష్ట్రం ఇలాగే…తమ భాష మాట్లాడే ఇతర రాష్ట్ర భౌగోళిక ప్రాంతం తమకే ఇవ్వాలని ఉద్యమిస్తే…దేశం రావణకాష్ఠమవుతుందా? రామరాజ్యమవుతుందా?
మీకేమయినా క్లారిటీ ఉందా?
ద్వాపర యుగంలో అయిదూళ్ల కోసం కురుక్షేత్రం జరిగింది. కలియుగంలో 40 ఊళ్లకోసం ఇంకెన్ని కురుక్షేత్రాలు జరగాలో?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :
Also Read :