చిత్తూరుజిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు లోక్ సభ సభ్యుడు ఎన్. రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఎం.ఎస్.బాబు, అరణి శ్రీనివాసులు, ఆలయ ఈవో వెంకటేసు, చిత్తూరు ఆర్డీవో రేణుక, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
నేడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21రోజులపాటు నిర్వహిస్తారు. ఈ నెల ౩౦న ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. గణేష్ మాల ధరించిన భక్తులు మాల ధారణ విరమించుకునేందుకు ప్రత్యేక సదుపాయం కల్పించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.