Tuesday, April 16, 2024
HomeTrending Newsలోక్ సభ ఎన్నికలు... అధికార విపక్షాల యాత్రలు

లోక్ సభ ఎన్నికలు… అధికార విపక్షాల యాత్రలు

తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల పోటా పోటీ కార్యక్రమాలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు.. ప్రతి  విమర్శలతో  రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవటం లేదని నిరసిస్తూ నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్ గా అన్నట్టు అదే రోజు ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు ప్రజాప్రతినిధుల కార్యక్రమం పెట్టారు.

ఇప్పుడు కాంగ్రెస్ అదే రీతిలో మరో ఎత్తుగడ వేసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా సిఎంగా కెసిఆర్ కుట్ర చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలమూరు ప్రాజెక్టు సందర్శించి బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను బయటపెడతామని ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని కెసిఆర్ కు సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయడానికే బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ పర్యటన అంటున్నారని ధ్వజమెత్తారు.

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి ఆరోపణలకు స్పందించిన మాజీ మంత్రి కేటిఆర్… సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మెదటిదికాదని…గతంలో అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయన్నారు. అప్పటి ప్రభుత్వాలు మరమత్తులు చేసి కాపాడాయని… ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయలేదన్నారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోగా గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిఏం పదవికి రాజీనామా చేసి… మల్కాజ్ గిరి ఎంపి స్థానంలో పోటీ చేద్దామని కేటిఆర్ సవాల్ విసిరారు. అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలన్నారు. పాలమూరు యాత్ర పోటీ యాత్రఅని… కేవలం ప్రజల దృష్టి మరలించడం కోసమే చేస్తున్నారని విమర్శించారు.

ప్రాజెక్టుల వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వాడి వేడి విమర్శల నేపథ్యంలో బిజెపి రంగంలోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు కేంద్రం అనుమతులు లేవని కేంద్ర నదుల అనుసంధాన టాస్క్ ఫోర్సు చైర్మెన్ వేదిరే శ్రీరాం ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పలేదన్నారు. ప్రాజెక్టుకు 400 రకాల అనుమతులు ఉన్నాయని.. వెదిరే శ్రీరాం భువనగిరి సీటుకోసం తాపత్రయంతో మాట్లాడుతున్నాడని కేటిఆర్ ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించి తెలంగాణ స్టేట్ TS అని ప్రకటించి అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని టిజి TGగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపారు. అన్ని రకాల వాహనదారులు మార్చుకోవాలా… ఎప్పటి నుంచి అనే అంశాలు తేలాల్సి ఉంది. పార్టీల పంతాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని పథకాలకు రేషన్ కార్డుతో లంకె పెట్టింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా కొత్త రేషన్‌కార్డులను జారీ చేయడం లేదు.

అప్పుడిస్తాం..ఇప్పుడిస్తాం.. అంటూ ప్రకటనలు చేయడమే తప్పా.. కార్యరూపం దాల్చడం లేదు. ఓవైపు పథకాలకు రేషన్‌కార్డును తప్పనిసరి చేయడం, మరోవైపు కొత్తవాటిని జారీ చేయకపోవడంతో అర్హులైన వారు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు.

కొండెక్కిన ధరలు గాడిలో పెట్టని పాలకులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసి కాలం గడుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్ళు గడిచినా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. అర్హులను గుర్తించే అంశంలో విధివిధానాలపై చిత్తశుద్ది లేదు. ఓట్ల రాజకీయమే లక్ష్యంగా ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ – కాంగ్రెస్ లు విమర్శలు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్