కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో మహా ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం పైకోమాట.. అంతర్గతంగా కుట్రకు తెర లేపుతుందని కేటీఆర్ అన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మాత్రం నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుజరాత్ మాదిరిగానే తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని ఎన్నోసార్లు తమ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ పై అపార ప్రేమను కనబరుస్తున్న దేశ ప్రధాని, ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని గుర్తుచేశారు. నవంబర్ 12 , 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానమంత్రే.. సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చి నిలుపుకోలేకపోయారని గుర్తుచేశారు. ప్రధాని.. హామీకే దిక్కులేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మరోసారి రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో దానిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి గమ్యాన్ని ముద్దాడిందన్నారు. ఈసారి పురుడుపోసుకునే మహోద్యమంతో.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.
Also Read : Satyender Jain: సత్యేందర్ జైన్ కు బెయిల్ నిరాకరణ