Olympiad Torch: చెస్ ఒలింపియాడ్ రిలే టార్చ్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం చేరుకుంది, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఈ టార్చ్ ను గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్ బాబు నుంచి రాష్ట్ర పరిశ్రమలు. ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్వీకరించారు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ట్వీట్ ద్వారా తెలియజేసింది. నిన్న ఈ టార్చ్ ను విజయవాడలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్వీకరించి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబుకు అందించారు. లలిత్ ఈ టార్చ్ తో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. అంతకుముందు శనివారం హైదరాబాద్ లో ఈ టార్చ్ ను గ్రాండ్ మాస్టర్లు హారిక ద్రోణవల్లి, అర్జున్ ల నుంచి తెలంగాణా రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస గౌడ్ స్వీకరించారు.
తమిళనాడులోని మహాబలిపురంలో జూలై 28 నుంచి ఆగస్ట్ 10 వరకూ ద ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఆధ్వర్యంలో 44వ చెస్ ఒలింపియాడ్ జరగనుంది. ప్రపంచంలోని 189 దేశాలనుంచి ఆటగాళ్ళు ఈ మెగా ఈవెంట్ లో ఆడనున్నారు
జూన్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన ఈ టార్చ్ ర్యాలీ దేశవ్యాప్తంగా 70 ఎంపిక చేసిన నగరాలలో సాగనుంది, మెగా టోర్నీ ప్రారంభానికి ముందు మహాబలిపురం చేరుకుంటుంది.