Sunday, January 19, 2025
HomeTrending Newsజస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ రమణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో చట్టాలు చేస్తున్న తీరుపై విచారం వ్యక్తం చేశారు. చట్టాలపై లోతైన చర్చ జరగపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్ట సభల్లో న్యాయవాదులు, మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే చట్టాలపై లోతైన చర్చ జరగడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. చట్టాల్లో ఎన్నో లోపాలుంటున్నాయని, దీంతో కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారంగా మారుతాయన్నారు.

పార్లమెంట్‌లో ఒకప్పుడు న్యాయదిగ్గజాలు సభ్యులుగా ఉండేవారని, గతంలో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదని తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని, అప్పట్లో తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా ఆ బిల్లును విశ్లేషించారని జస్టిస్ట్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. కార్మికులు, వివిధ రంగాలపై ఆ బిల్లు చూపే ప్రభావాన్ని ఎంపీ రామ్మూర్తి లోతుగా విశ్లేషించి చెప్పారని, ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్‌లో కరువైందని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి, చట్ట సభలకు రావాలని సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులకు సంపాదనే పరమావధి కాకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్