రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని రూపొందించే అంశంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ రోడ్లు పాడుకాకుండా, దీర్ఘకాలం నాణ్యతతో ఉండేలా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. ప్రజలకు సత్వరంగా సేవలు అందడం, నిర్దేశిత సమయంలోగా అనుమతులు ఇవ్వడం… అవినీతి లేకుండా చూడడమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 28 అర్భన్ లోకల్ బాడీస్‌ను కవర్ చేస్తూ ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది.
సమీక్ష సందర్భంగా సిఎం సూచనలు :
మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకు వస్తున్న యాప్‌ను గ్రామాల్లోకూడా అందుబాటులోకి తీసుకురావాలి
నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి
ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలి
మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలి
టౌన్ ప్లానింగ్ సహా.. ఇతరత్రా విభాగాల్లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను పరిశీలన చేయండి
సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల్‌పై నిశిత సమీక్షచేసి తగిన ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశం.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.