Sunday, January 19, 2025
HomeTrending Newsనేడు తిరుమలకు సిఎం జగన్

నేడు తిరుమలకు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకు రానున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బర్డ్‌ హాస్పిటల్‌ చేరుకుని, చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స కేంద్రాన్ని సిఎం ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుండి అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గో మందిరాన్ని ప్రారంభిస్తారు.

సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు, అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు, తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

రేపు 12వ తేదీ ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ ఛానళ్ళను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిధి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ కు తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్