Monday, May 20, 2024
HomeTrending Newsఅప్రమత్తంగా ఉండాలి: సిఎం జగన్

అప్రమత్తంగా ఉండాలి: సిఎం జగన్

రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు తమకు సంబంధించిన వ్యక్తి మాత్రమే సిఎంగా ఉండాలన్న  లక్ష్యంతోనే పని చేస్తున్నాయని, దానికోసం ఎంతకైనా తెగించే పరిస్థితికి వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. మీడియా సంస్థల పేర్లు ప్రస్తావిస్తూ వారు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఎవరిపై బురదజల్లడానికైనా వెనకాడడం లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని దురదృష్టకర సంఘటనలను కూడా కొందరు నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని, అలాంటి వారికి ఓ వర్గం మీడియా వంత పాడుతోందని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు.  అందుకే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా, సున్నితంగా వ్యవహరించాలని, ఆడపిల్లలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వ్యవస్థలో మనం రాజకీయ నేతలనే కాకుండా మీడియాను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత జగరూకతతో పనిచేయాలని సూచించారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవలి కాలంలో విద్యార్ధినులు, మహిళలపై జరుగుతున్న సంఘటననలు ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్లు, ఎస్పీలు సమర్ధవంతంగా వ్యవహరించినప్పటికీ దురుద్దేశాలు ఆపాదిస్తూ ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని సిఎం వ్యాఖ్యానించారు.  కొన్ని సంఘటనల్లో బాధితులైన ఆడపిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు ఆవేదన, నష్టం జరుగుతుందని తెలిసినా కొందరు పని గట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లలను, వారి కుటుంబాలను బజారుకీడుస్తూ సమాజంలో వారి పరువు ప్రతిష్ఠలకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నారని సిఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం, ఇళ్ళ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై అధికారులకు సిఎం జగన్ పలు సూచనలు  చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్