Sunday, November 24, 2024
HomeTrending Newsవిద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంచాలి : సిఎం

విద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంచాలి : సిఎం

ప్రపంచ స్ధాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంపొండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దీనికోసం టోఫెల్‌, క్రేంబ్రిడ్జి సంస్థల భాగస్వామ్యంతో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3వ తరగతి నుంచీ పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫకెట్లు జారీచేసేలా కార్యక్రమాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.  టీచర్లకూ ఇంగ్లిషుపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు.  తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై  సిఎం జగన్ సమీక్ష నిర్వ‌హించారు.  సబ్జెక్టుల వారీ టీచర్లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌బీ, టీవీ స్క్రీన్లు, వీటిలో ఉంచాల్సిన పాఠ్యాంశాలు, బైజూస్‌ ట్యాబుల వినియోగం, స్వేఛ్చ, విద్యార్థులకు రాగి జావ, జగనన్న విద్యాకానుక, నాడు–నేడు కార్యక్రమాల అమలు తీరుపై కూడా సిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లు ప్రారంభంలోగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను అందించడానికి చర్యలు తీసుకోవాలని, పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్‌…. ఇవన్నీ కూడా పూర్తి సినర్జీతో ఉండాలని సిఎం సూచించారు. విద్యాసంవత్సరంలో జగనన్న విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులను పరిశీలించారు, యూనిఫాం, షూ, పుస్త‌కాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, నాణ్య‌త‌పై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం.వి శేషగిరిబాబు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్‌.దీవాన్‌ రెడ్డి, నాడు–నేడు టెక్నికల్‌ డైరెక్టర్‌ మనోహరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్