Sunday, November 24, 2024
HomeTrending Newsప్రమాదపు అంచులో జోషీమఠ్‌

ప్రమాదపు అంచులో జోషీమఠ్‌

ఉత్త‌రాఖండ్‌లోని జోషీమ‌ఠ్‌లో ఇండ్లు కుంచించుకుపోతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలో ఓ ఆల‌యం కూలిపోయింది. అనేక ఇండ్లు ప‌గుళ్లు ప‌ట్టాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది. త‌క్ష‌ణ‌మే 600 కుటుంబాల‌ను త‌ర‌లించాల‌ని ఆదేశించింది. జోషీమ‌ఠ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై స్ట‌డీ చేప‌ట్టాల‌ని కేంద్రం ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. భూమి ఎందుకు కుంచించుకుపోతుందో బృందం అధ్య‌య‌నం చేయ‌నున్న‌ది. బిల్డింగ్‌లు, హైవేలు, ఇత‌ర‌మౌళిక స‌దుపాయాలు కూడా ఆ ప‌ట్ట‌ణంలో నేల‌కూలుతున్నాయి. దీంతో  ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇవాళ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి .. జోషీమ‌ఠ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించేందుకు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక ప్రణాళిక‌ల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అవ‌స‌రం అయితే విమానాల్లో ప్ర‌జ‌ల్ని త‌ర‌లించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్‌ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ డైరెక్టర్‌ కలాచంద్‌ సైన్‌ తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల చెంత ఉన్న ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ పట్టణంలో ఇండ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణాలను కలాచంద్‌ సైన్‌ వివరించారు. దాదాపు వందేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. ఈ కొండచరియల శిథిలాల మీద జోషీమఠ్‌ నిర్మాణం జరిగిందని, అందుకే పట్టణ పునాదులు బలహీనంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సెస్మిక్‌ జోన్‌- 5లో ఉండటం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా ఇక్కడి శిలలు బలహీనంగా మారిపోయాయన్నారు.

జోషీమఠ్‌కు ప్రమాదం పొంచి ఉండటం గురించి చాలా ఏళ్ల నుంచి హెచ్చరికలు ఉన్నట్లు కలాచంద్‌ సైన్‌ తెలిపారు. 1886లో హిమాలయన్‌ గెజెటర్‌లో జోషీమఠ్‌ కొండచరియల శిథిలాల మీద నిర్మితం అవుతున్నదని ఆట్కిన్స్‌ రాశారని చెప్పారు. 1976లో కూడా మిశ్రా కమిటీ జోషీమఠ్‌కు పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించిందని పేర్కొన్నారు. జోషీమఠ్‌లో జనాభా పెరగడం వల్ల కట్టడాలు పెరగడం, పర్యాటక ప్రాంతంగా ఉండటం వల్ల హోటళ్ల వంటి భారీ నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు సమస్య జఠిలమైందని పేర్కొన్నారు. జోషీమఠ్‌లో చాలా ఇండ్లు కూలిపోవచ్చని, ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.

వాతావ‌ర‌ణ మార్పులు, కొండలు తొలిచి అభివృద్ధి పనులు జ‌ర‌గ‌డం వ‌ల్లే జోషీమ‌ఠ్‌లో ఇలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు భావిస్తున్నారు. బ‌ద్రీనాథ్‌, హేమ‌కుండ్ సాహిబ్‌కు వెళ్లేందుకు జోషీమ‌ఠ్ కీల‌క మార్గం. ఈ ప‌ట్ట‌ణం నుంచి ఆ రెండు క్షేత్రాల‌కు భ‌క్తులు వెళ్తుంటారు. ఇండియా, చైనా బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న మిలిట‌రీ బేస్ క్యాంప్ కూడా ఇక్క‌డే ఉంటుంది. ఇక ఆసియాలోనే అతిపెద్ద అవులీ రోప్‌వే కూడా ఇక్క‌డే ఉంది. ప్ర‌స్తుతం రోప్‌వే ప్రాంతంలో క్రాక్‌లు రావ‌డం వ‌ల్ల దాన్ని నిలిపివేశారు. హీలాండ్‌-మార్వారి బైపాస్ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ఆపేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్