రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. సిఎం జగన్ తో పోల్చుకోవడం పవన్ కు తగదన్నారు. పవన్ రాజకీయాల కంటే సినిమాల్లోనే మంచి నటుడిగా గుర్తింపు పొందారని, వ్యక్తిగతంగా తాను కూడా పవన్ అభిమానినేనని ధర్మాన వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారని అలాంటి వ్యక్తి జగన్ పై విమర్శలు చేయడం సరికాదని, విజ్ఞతతో మాట్లాడాలని ధర్మాన సూచించారు. జగన్ ను విమర్శించే స్థాయి పవన్, లోకేష్ లకు లేదన్నారు. సిఎం జగన్ ప్రజల్లో లేరంటూ పవన్ వ్యాఖ్యానించడం అయన అవివేకానికి నిదర్శనమని, పార్టీ పెట్టిన నాటినుంచి గ్రామ గ్రామానా ప్రతి వ్యక్తినీ కలుసుకున్న నాయకుడని, రాష్ట్ర ప్రజల సమస్యలు, భౌగోళిక పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ధర్మాన చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టో ను అతి తక్కువ కాలంలోనే అమలు చేసి చూపించిన నాయకుడని పేర్కొన్నారు. జగన్ కు జగనే సాటి అని ధర్మాన అభిప్రాయం వ్యక్తం చేశారు.