Thursday, March 28, 2024
Homeసినిమాపోలీసు పాత్రలకు పెట్టింది పేరు

పోలీసు పాత్రలకు పెట్టింది పేరు

Silver Screen Angry Man: రాజశేఖర్ .. ఈ పేరు వినగానే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గుర్తుకు వస్తాడు. అనినీతికి పాల్పడే విలన్ గ్యాంగ్ పై ఆవేశంతో ఆయన విరుచుకుపడే తీరు కళ్లముందు కదలాడుతుంది. తెలుగు తెరపై అంతకుముందు పోలీస్ ఆఫీసర్ పాత్రలను చాలామంది పోషించారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు రాజశేఖర్ ఒక ప్రత్యేకతను తీసుకుని వచ్చారు. పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని ఆడియన్స్ అనుకునేలా ఆ పాత్రల్లో జీవించారు. ఖాకీ డ్రెస్ లో ఆయన చెలరేగిపోయిన తీరును ప్రతీక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.

రాజశేఖర్ పోలీస్ పాత్రలను అంత బాగా చేయడానికి ఒక కారణం ఉందనిపిస్తుంది. ఆయన తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. తాను కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన వైద్య వృత్తిని చేపట్టవలసి వచ్చింది. పోలీస్ ఆఫీసర్ కావాలనే తన కోరికను ఇలా ఆయన తీర్చుకున్నాడేమోనని అనిపిస్తుంది. రాజశేఖర్ పుట్టి పెరిగిందంతా తమిళనాడులోనే. అందువలన ఆయనకి తెలుగు అంతగా రాదు. రాజశేఖర్ యాక్షన్ కి సాయికుమార్ డబ్బింగ్ తోడు కావడం వలన ఆ పాత్రలు మరింత పవర్ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రాజశేఖర్ తన కెరియర్ ఆరంభంలో ‘వందేమాతరం’ .. ‘అరుణ కిరణం’ .. ‘రేపటి పౌరులు’ వంటి సినిమాల్లో నటించారు. సాధారణంగా హీరోయిన్స్ స్మైల్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరో స్మైల్ బాగుందని మాట్లాడుకోవడం రాజశేఖర్ విషయంలో మాత్రమే జరిగింది. ‘తలంబ్రాలు’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేసిన రాజశేఖర్, ఆ తరువాత యాంగ్రీ యంగ్ మెన్ అనిపించుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అప్పటివరకూ సాఫ్ట్ కేరక్టర్స్  వేస్తూ వచ్చిన ఆయన, ‘అంకుశం’ సినిమాలో యాక్షన్ హీరోగా తన విశ్వరూపం చూపించారు.

‘అంకుశం’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. రాజశేఖర్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు రాజశేఖర్ ను కేరాఫ్ అడ్రెస్ గా మార్చింది ఈ సినిమానే. ‘అంగరక్షకుడు’ .. ‘మగాడు’ వంటి సినిమాలు ఆ దిశగా ఆయనకి మరింత ఊతాన్నిచ్చాయి. రాజశేఖర్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలడు అనే అభిప్రాయం జనంలో బలపడుతున్న సమయంలో వచ్చిన ‘అక్కమొగుడు’ .. డాన్సులు చేయలేడు అనే విమర్శలు వస్తున్న సమయంలో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ ఆయన కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి.

రాజశేఖర్ విషయంలో కూడా కొంతకాలం పాటు టైటిల్ సెంటిమెంట్ నడిచింది. ‘అ’ అక్షరంతో ఆయన టైటిల్స్ మొదలయ్యేవి. అలా వచ్చిన సినిమాలు చాలా వరకూ హిట్ అయ్యాయి కూడా. రాజశేఖర్ కూడా వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనను పోలీస్ పాత్రలే ఆదుకోవడం విశేషం. ఆ మధ్య ‘గరుడ వేగ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, త్వరలో ‘శేఖర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

DR Rajasekhar

ఒక వైపున చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ .. జగపతిబాబు .. సుమన్ వంటి హీరోలు బరిలో ఉండగా రాజశేఖర్ రంగంలోకి దిగారు. వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడటం అంత ఆషా మాషీ విషయమేం కాదు. అయినా ఒక వైపున యాక్షన్ సినిమాలతో యూత్ ను .. మాస్ ను ఆకట్టుకున్నారు. మరో వైపున ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరాభిమానాలను అందుకున్నారు. పరాజయాలకు వెన్ను చూపకుండా పట్టుదలతో పరిగెడుతూనే ఉన్నారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

 (రాజశేఖర్ జన్మదిన ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read :

కోట్లాదిమందికి ఆనందం పంచిన బ్రహ్మానందం

RELATED ARTICLES

Most Popular

న్యూస్