Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రభుత్వం- పోలీసు- మీడియా సమర్పణలో

ప్రభుత్వం- పోలీసు- మీడియా సమర్పణలో

Aryan Khan drugs case & The Combo

ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా..
ఈ మూడిటి కలయిక..ఒక డెడ్లీ కాంబినేషన్.
వీళ్ళు ముగ్గురూ కలిస్తే…
మాంఛి కిక్ ఇచ్చే సినిమా తీయగలరు.
కథ, దర్శకత్వం.. ప్రభుత్వానిది.
నటన.. దర్యాప్తుసంస్థలది.
ప్రదర్శన.. మీడియాది.

లేటెస్ట్ కథలో హీరో… సమీర్ వాంఖడే..
డెడ్లీ విలన్.. ఆర్యన్ ఖాన్..
మాంచి కాస్ట్లీ క్రూయిజ్ సెటప్ వుంది…
డ్రగ్స్ పార్టీ బ్యాక్ గ్రౌండ్ వుంది.
విలన్ డ్రగ్స్ తీసుకుంటుండగా హీరో వచ్చి పట్టుకుంటాడు..
తర్వాత సీన్ ఇంటరాగేషన్ రూమ్ కి మారుతుంది.
ఇక్కడే మీడియా రోల్ మొదలవుతుంది.
ఎన్ సి బి.. రోజుకో కథ వండి మీడియాకి లీక్ చేస్తుంది.

ఒకరోజు ఆర్యన్ ఖాన్ ఏడ్చాడని,
ఇంకో రోజు నేను మంచివాడిగా మారతానని చెప్పాడనీ,
మరో రోజు డ్రగ్ మాఫియాతో సంబంధాల్ని ఒప్పుకున్నాడని…
మీడియాకు లీకులొస్తాయి.
ఈ అర్ధ సత్యాలనీ, అసత్యాలని కలిపి మీడియా మంచి కాక్
టెయిల్ తయారు చేస్తుంది.
ఇంత రసపట్టులో వున్న కథ మధ్యలో కొందరు పానకంలో
పుడకల్లా వస్తారు.

ఇందులో మతం వుంది..
హిందుత్వ రాజకీయాలున్నాయి..
మైనారిటీ ఐకన్ల మీద కక్షసాధింపు వుంది..
అధికార వ్యవస్థల దుర్వినియోగం వుంది..
సెలెబ్రిటీలను లొంగదీసుకునే కుట్ర వుంది…
ఎన్ సిబి అధికారి లంచగొండితనం వుంది.. అని చెప్తారు.
అప్పటిదాకా మాంఛి క్రైమ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేస్తున్న మనకి
ఈ రాజకీయాలు చిరాకు పుట్టిస్తాయి..
కానీ.. ఈ పానకంలో పుడకలు ఊరుకోరు..
సమాధానాల్లేని ప్రశ్నలేసి మరింత చికాకు పెడతారు.

ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరికాయా?
దొరికినట్టు ఎన్ సిబి కోర్టుకు చెప్పిందా?
అత్యంత రహస్యంగా జరగాల్సిన రెయిడ్ లో ఒక ప్రయివేట్
డిటెక్టివ్ గోసావి ఎందుకున్నాడు?
దర్యాప్తు చేస్తున్న ఆఫీసులో కూడా ఆ గోసావికి ఏం పని?
సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసే ధైర్యం
అతనికెలా వచ్చింది?

గోసావి ఇప్పుడు ప్రాణభయంతో ఎందుకు వణికిపోతున్నాడు.?.
వాంఖడే తరపున గోసావి సెటిల్ మెంట్లు చేస్తాడా?
పాతిక కోట్ల డీల్ గురించి గోసావి మాట్లాడుతుండగా విన్నానని
అతని బాడీగార్డ్ చెప్తున్న మాటల్లో నిజానిజాలేంటి?
నిన్నటిదాకా ఎన్ సిబి తరపున సాక్షిగా వున్న ఆ బాడీగార్డ్
ఇప్పుడు ఎందుకు ఎదురుతిరిగాడు?

ఆర్యన్ ని క్రూయిజ్ లోకి పంపడంలోనూ, రెయిడ్
చేయడంలోనూ బిజెపి నేతల పాత్ర ఏంటి?
ఎన్ సి బి గతంలో చేసిన రియాచక్రవర్తి కేసు ఏమైంది?
ఎందుకు అది మూలన పడింది?
బీహార్ ఎన్నికల ముందు రియా కేసు,
యుపి ఎన్నికల ముందు షారూఖ్ ఖాన్ కేసుల వల్ల ఏ పార్టీకి లాభం?
షారూక్ ఖాన్ ని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
ఎందుకు అదేపనిగా తిడుతున్నాడు?

పక్కనే గుజరాత్ పోర్టులో వేలకోట్ల డ్రగ్స్ పట్టుబడినా.. దాని
గురించి ఉలుకుపలుకు లేదెందుకు?
ఈప్రశ్నలు వేస్తే .. సమాధానాలు రావు.
ఎదురు ప్రశ్నలొస్తాయి.
డ్రగ్స్ మాఫియాకి వత్తాసు పలుకుతారా?
స్టార్ హీరో కొడుకైతే కేసులు పెట్టకూడదా?
నేరాల్లోకి మతాన్ని తీసుకొస్తారా?
ఇవన్నీ తిరుగులేని అస్త్రాలు..
ప్రశ్నల నోరుమూయించే పాతవిద్యలు..

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కి పాత కక్షలే
వున్నాయనుకుందాం..
తన అల్లుడిని డ్రగ్స్ కేసులో ఇరికించినందుకు ఇప్పుడు
వాంకడేమీద పగతీర్చుకుంటున్నాడనుకుందాం..
కానీ, అతని ఆరోపణల్లో నిజానిజాలు తేలాలి కదా?
వాంకడే అవినీతి చేసాడో లేదో విచారణ జరగాలి కదా..
తన ముస్లిమ్ పుట్టుకని దాచిపెట్టి, హిందు ఎస్ సిగా తప్పుడు
సర్టిఫికెట్లతో వాంకడే.. ఐ ఆర్ ఎస్ ఉద్యోగం సంపాదించాడన్న
ఆరోపణల్లో నిజమెంతో నిగ్గుతేలాలి కదా?

క్రూయిజ్ మీద దాడిలో ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదన్నది నిజం.
ప్రస్తుతానికి కొన్ని పాత వాట్సప్ చాట్ లు తప్ప ఎన్ సి బి దగ్గర
ఏ ఆధారాలూ లేవన్నది నిజం.
ఆ చాట్స్ కి క్రూయిజ్ లో పార్టీకి సంబంధం లేదన్నది నిజం.
అవన్నీ క్లౌడ్ మెమొరీలో సేవ్ అయిన పాత మెసేజ్ లన్నది నిజం.
ఆ చాట్స్ లో ఏముందో.. అవి ఎంత వరకు సాక్ష్యాలుగా
నిలబడతాయో విచారణలోనే తేలుతుంది..

క్రూయిజ్ లో తన స్నేహితుడి దగ్గర డ్రగ్స్ వున్నాయన్న
విషయం ఆర్యన్ కి తెలుసని, అదే అతని నేరమని
(conscious possession) ఎన్ సి బి కొత్త
సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది..
ఇలాంటి నేరం.. ఎన్ సిబి చట్టంలోనే లేదని చట్టం తెలిసిన
వాళ్ళంటున్నారు.
అసలు ఆర్యన్ ఖాన్ ని ఆ షిప్ లోకి రప్పించడం వెనుకే ఒక
పథకం వుందని మరో ఆరోపణ.

ఏది నమ్ముతాం?
ఏది నమ్మం.
ఏది నిజం..
ఏది ప్రచారం..
మీరెటు నిలబడ్డారనే దానిమీద ఆధారపడివుంటాయి.
బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ తిరుగులేని సూపర్ స్టార్..
బాలీవుడ్ చాలా ఏళ్ల నుంచి ఖాన్ త్రయం ఆధిపత్యంలోనే వుంది.
ఈ స్టార్లను దెబ్బకొడితే, అది ముస్లిమ్ ఆధిపత్యాన్ని
కొట్టినట్టే అని హిందుత్వ శక్తులు భావిస్తాయి.

ఆర్ ఎస్ ఎస్ అధికార పత్రికలను తిరగేస్తే కొంత కాలంగా
ముస్లిమ్ హీరోల మీద కక్కుతున్న విషం కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ అధికారిక దాడులు దానికి కొనసాగింపే అని అర్థమవుతుంది.
బాలీవుడ్ లో తనవాళ్ళెవరు , కాని వాళ్లెవరు అనేది తేల్చుకునే
ప్రక్రియ చాలాకాలంగా సాగుతోంది.
అమితాబ్ కుటుంబం,అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కంగనా
లాంటి వాళ్లు మనవాళ్ళ జాబితా లోకి ఎప్పుడో చేరిపోయారు.

షారూఖ్ ఖాన్ మాత్రం రాజకీయాలకు దూరంగా వున్నాడు.
మోడీ స్తుతిలో శ్రుతి కలపలేదు.
కాబట్టీ, షారూఖ్ “మన” లాబీలో లేడు..
గతంలో ఢిల్లీ నిరసనలకి సంఘీభావంగా వెళ్ళినందుకు,
హిందూనటి దీపికాపడుకునేకి కూడా డ్రగ్స్ కేసు చుట్టుకోవడం తెలిసిందే.
ఇక్కడ “మనమా.. వాళ్ళా ” అనేది అంత ఖచ్చితంగా వుంటుంది.
ప్రకటనల్లో ఉర్దు వుండకూడదని కంపెనీలని బెదిరించేదెవరు?

క్రికెట్ ఓడిపోతే ముస్లిమ్ ప్లేయర్లను వేధించేదెవరు?
వెబ్ సిరీస్ పేర్లని మార్చాలని దాడులు చేసేదెవరు?..
వాటి వెనుక వుండే రాజకీయ పార్టీలేంటి?
అవి సృష్టించే విద్వేష భావజాలమేంటి?
ఇదంతా అర్థం చేసుకుంటే.. షారూఖ్
కొడుకు ఎందుకు విలన్ అయ్యాడో అర్థమవుతుంది.
వాంఖడే ఎలా హీరో అయ్యాడో అర్థమవుతుంది.

ఇప్పటికే మహరాష్ట్రలో బిజెపియేతర నేతలమీద రకరకాల
సంస్థలు దాడులు జరుగుతున్నాయి..
ఒకరోజు సి బి ఐ,
ఒకరోజు ఐటి,
ఇంకో రోజు ఇడీ..
ఇప్పుడు తాజాగా ఎన్ సి బి.
ఇవన్నీ సర్కారువారి పాలేర్లే..
ఇది అందరికీ తెలిసిన రహస్యమే.

కానీ.. ఇక్కడ అరెస్టయింది..షారూఖ్ ఖాన్ కొడుకు.
డబ్బున్నవాళ్ళ మీద, సెలెబ్రిటీల మీద సగటు జనాలకి కనిపించని కసి ఉంటుంది.
వాళ్ళు ఇలా “అడ్డంగా బుక్కయి”నప్పుడు ఆ కసి బయటికొస్తుంది.
దీనికి మతం తోడైతే నిప్పులో నెయ్యిపోసినట్టే.
ఇక కోర్టులు, విచారణలూ అవసరమే లేదు.
వీడు ఆ పని చేసే వుంటాడు..ఫిక్స్..

ఇదంతా చదివాక కూడా మీకు కోర్టుల్లో విచారణ పూర్తి కాకముందే.. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విలన్ గానూ, వాంకడే హీరోగానూ కనిపించారంటే.. మోడీ మూడోసారి కూడా ప్రధాని అవడం ఖాయమని అర్థం.

-శైలి.

Also Read:

రామరాజ్యంలో రైతు శోకం

Also Read:

ఏది స్వదేశి? ఏది విదేశి?

Also Read:

మంచి – చెడు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్