Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందేవుడిమీద ఒట్టు... నేను అమ్ముడుపోలేదు...

దేవుడిమీద ఒట్టు… నేను అమ్ముడుపోలేదు…

I Swear:
“సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే;
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః”
అన్ని ఆగమాలకంటే ముందు ఆచారం ఏర్పడింది. ఆచారం నుండి ధర్మం పుట్టింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వల్ల స్థిరపడింది ధర్మం. జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం. ధర్మం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన వాడు విష్ణువు కాబట్టి ధర్మానికి ప్రభువు విష్ణువే.
-విష్ణు సహస్రనామం.

ఎన్ని యుగాలైనా కొన్ని ప్రమాణాలు మారవు. అలాంటి ప్రమాణాలే ఆ జాతి సంస్కృతిగా గుర్తింపు పొందుతాయి. అలా మనం చేసే “ప్రమాణాలు”; పెట్టే “ఒట్లు” కూడా మన సంస్కృతిలో అంతర్భాగం.

భారత దేశంలో ఎదుటివారిని నమ్మించడానికి చేసే ప్రమాణాలు ఎన్ని ఉన్నా- రెండు మాత్రం చాలా ప్రామాణికమైనవి.
1 . అమ్మతోడు
2 . దేవుడి మీద ఒట్టు(గాడ్ ప్రామిస్)

అదేదో సినిమాలో డైలాగ్ వల్ల తెలుగులో అమ్మతోడు అడ్డంగా నరికివేతకు గురై విలువ కోల్పోయింది కానీ…హిందీ “మా కసమ్” తో పాటు మిగతా భాషల్లో మాత్రం “అమ్మతోడు” విలువ తగ్గలేదు.

1 . తడి బట్టలతో గుడిలో దేవుడి ముందు ప్రమాణం
2 . గుడి ముందు నెత్తిన పసుపు నీళ్లు పోసుకుని…గుళ్లో దేవుడి ముందు ప్రమాణం చేయడం
3 . అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయడం
4 . గుళ్లో దీపం ఆర్పి ప్రమాణం చేయడం
5 . బిడ్డల మీద ప్రమాణం చేయడం
6 . వంశం పేరు మీద ప్రమాణం చేయడం
7 . ఎదుటివారి మీద ప్రమాణం చేయడం( నీమీద ఒట్టు)
8 . పంచభూతాల మీద ఒట్టు పెట్టడం

ఇలా ఈ లిస్ట్ కొండవీటి చేంతాడు కంటే పెద్దది. భారతీయ న్యాయస్థానాల్లో బోనులో ప్రమాణంతోనే విచారణ ప్రారంభమవుతుంది. ఎన్నికైన ప్రతినిధుల ఉద్యోగం ప్రమాణ స్వీకారంతోనే మొదలవుతుంది. చేసిన ప్రమాణం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయా! లేదా! అన్నది వేరే చర్చ.

మనం అలవాటుగా అలవోకగా చేసే ప్రమాణానికి ఒక రాజ్యాంగపరమైన ప్రమాణం ఉందన్నది మాత్రం నిజం.

ఒట్లకు- ఓట్లకు మొదటి అక్షరంలో దీర్ఘం తప్ప ఏదో పోలిక ధ్వనిలోనే కాకుండా…ఆచరణలో కూడా ఉన్నట్లుంది. ఓట్లు వేయించుకోవడానికి వేన వేల ఒట్లు పెట్టాలి. గెలిచాక ఆ ఒట్టును తీసి గట్టు మీద పెట్టాలి!

తెలంగాణ సిద్ధిపేట ఎన్నికల్లో బి జె పి అభ్యర్థి దూది శ్రీకాంత రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. బి ఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి హరీష్ రావుకు అమ్ముడుపోయాడని శ్రీకాంతరెడ్డి మీద ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. దాంతో ఆయన సిద్ధిపేట ప్రఖ్యాత వేంకటేశ్వరస్వామి గుడి ముందు పసుపు నీళ్ల స్నానం చేసి…ఆ తడి బట్టలతో గుళ్లోకి వెళ్లి…హరీష్ రావుకు అమ్ముడుపోలేదని సనాతన సంప్రదాయ విధానంలో ప్రమాణం చేశారు.

ఆ పవిత్ర ప్రమాణం లోకానికి తెలియడం అవసరం కాబట్టి…ముందుగా కెమెరా భంగిమలు సరిచూసుకున్నారు.

మంచిదే. నానా బూతుల అమ్మ, అక్క, అయ్య అని పరస్పరం తిట్టుకోవడం కంటే ఏ రకంగా చూసినా ఇది మెరుగైనదే. ఒంటి మీద పసుపు పూసుకున్నా, పసుపు నీళ్లు చల్లుకున్నా…హానికారకమైన సూక్ష్మక్రిములు నశిస్తాయని శాస్త్రీయంగా రుజువయ్యింది. అందుకే భారతదేశంలో రిటర్నింగ్ అధికారి ముందు మ్యాండేటరీగా నిలుచుని కాగితం మీద రాసి ఉన్నది చదివే అభ్యర్థుల ప్రమాణాలతో పాటు…ఆచారంలో భాగంగా ఉన్న తడిబట్టల ప్రమాణాల విలువ తగ్గలేదు.

కొసమెరుపు:-
బీ జె పి అభ్యర్థి తడిబట్టల గుడి ప్రమాణ సందర్భంలో ఆయన అనుచరులు చేస్తున్న-
“వాడెవ్వడు?
వీడెవ్వడు?
బీజేపీకి అడ్డెవ్వడు?”
నినాదాల్లో ప్రాసలు ఎంత అందంగా ఒదిగాయో!

మనలో మన మాట-
నిజమే కదా!
తెలంగాణాలో బీ జె పి కి వాడు, వీడు అడ్డెందుకు అవుతారు?
వాళ్లకు వాళ్లే అడ్డు తప్ప…

తెలుగు భాషలో ఉన్న అందమదే. ఆరుద్ర ఒక్కడేనా అంత్యప్రాసలతో ఆడుకునేది? తెలుగు భాషే యతిప్రాసల తూగుటుయ్యాల. సగటు గ్రామీణ రాజకీయ నాయకుడి నోట్లో దొర్లే తెలుగు నినాదాల అందచందాల మీద ఎన్నెన్నో పి హెచ్ డి లు జరగాల్సిన అవసరం ఎంతయినా ఉంది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్