Sunday, May 19, 2024
Homeఫీచర్స్మర్చిపోడానికి చికిత్స ఉందా?

మర్చిపోడానికి చికిత్స ఉందా?

Family Counselling :

Q.నా వయసు 26. నా మనస్తత్వం ఎలాంటిది అంటే..ఎవరికైనా నా మనసులో మాట చెప్పాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా ..ఎన్ని రోజులైనా, వారాలైనా, నెలలైనా అలాగే నేను గుర్తు పెట్టుకుంటా. అవి మంచివైనా చెడువైనా అన్నీ పద్దతిగానే జరగాలి, అవి నాకు మాత్రమే సొంతం (కొన్ని) అయి ఉండాలి అనుకునే మనస్తత్వం. నా అనుకున్నవాళ్ళు నామాటే వినాలి, నేను చెప్పిందే వినాలి.

నేను ఒక అమ్మాయిని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నా.. చాలా మంచిది. తాను నన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తోందట. తను ఎమ్మెస్సి చేసి టీచర్ గా చేస్తోంది. అప్పటినుంచి నేను కూడా తనను అంతకంటే ఎక్కువగా ఇష్టపడ్డాను.తను ఏం చేసినా నాకు చెప్పే చేసేది..నేను వద్దు అంటే చేసేది కాదు.అలాంటిది కొన్ని నెలల తర్వాత నాకు చెప్పకుండా అన్నీ చేస్తోంది..నేను వద్దు అన్నా కూడా..చేస్తోంది.ఇప్పుడు నాకు నేను తన దృష్టిలో తక్కువయ్యానేమో అనే భావన దహించి వేస్తోంది. తనను నేను నాకు అన్నీ చెప్పి చేయి అని చెప్పలేదు. చెప్పకుండా చేయి అని కూడా చెప్పలేదు..ఇప్పుడు చాలా నా ప్రమేయం లేకుండా చేస్తోంది..దీన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలి? ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడినా.. అలా ప్రవర్తించినా నాకు నచ్చదు. జీవితంలో క్షమించను..నా మనసు ఒప్పుకోదు..అలాంటి మనస్తత్వం నాది. ఇది తప్పో..ఒప్పో తెలీదు. అది మా అమ్మానాన్నలైనా, కట్టుకున్న భార్య అయినా నాకు ఒక్కటే..( నాకు ఇంకా పెళ్లి కాలేదు). ఇదే మనస్తత్వంతో చాలామందిని నేను దూరం పెట్టాను. ఇప్పుడు నాకు ఏ ఫీలింగ్ లేదు. ఎప్పటికీ కలవను. మాట్లాడను..

Family Counselling – సమస్య- నేను ప్రేమించిన అమ్మాయి తో నాకు చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి..అలాగే చులకన, చెప్పినట్లు వినకపోవడం..భరించలేను. అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఆ అమ్మాయితో జీవితాన్ని పంచుకోలేను. తను లేకుండా ఉండనూలేను.. నాకు ఒకసారి ఆలోచనలు వచ్చాయంటే అవి పోవు..ఒక్కొక్కసారి మధ్యలో నిద్ర మెలకువ వస్తే ఇక నిద్ర రాదు..ఇలా కొన్ని వారాలు జరిగింది. దీనివల్ల నాకు భరించలేని తలనొప్పి వచ్చింది  వస్తూనే ఉంది..నేను చాలా కుంగిపోయి ఉన్నా.. మానసికంగా, శారీరకంగా కూడా..ఇలా ఇవి నన్ను జీవితాంతం కుంగదీస్తాయి..నా వల్ల తనకు ఏ ఇబ్బంది ఉండ కూడదు. ఎప్పుడూ ఆ అమ్మాయిని బాధ పెట్టలేదు. పెట్టను కూడా. అందుకే నేను ఆ అమ్మాయి జీవితoలో నుంచి తప్పుకోవలనుకుంటున్నా. నేను, మా అమ్మ తప్ప మాకు ఎవరూ లేరు. జీవితాంతం నేను మా అమ్మకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి జ్ఞాపకాలు నన్ను వీడి పోవు. అలాంటి జ్ఞాపకాలతో నేను బాధ పడలేను..కానీ  నేనూ బాగుండాలి. ఆ అమ్మాయి కూడా బాగుండాలి. మేమిద్దరం బాగుండాలి అని అంటే..నాకు..తనకు సంబంధించిన ఏ ఒక్క జ్ఞాపకం కూడా ఉండకూడదు..ఒక్కొక్కసారి తలలో నరాలు చిట్లిపోయేలా నొప్పి వస్తుంది..నేను ఆ నొప్పిని భరించలేను. నాకు ఆ అమ్మాయికి సంబంధించిన ఏ జ్ఞాపకాలు వద్దు..నాలో  ఆ అమ్మాయి జ్ఞాపకాలను సమూలంగా తీసేయగలరా? అలాంటి టైంలో నాకు పూర్తిగా జ్ఞాపకశక్తి పోయే అవకాశం ఉందా? మధ్యలో ఆ జ్ఞాపకాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా..ఒకవేళ జ్ఞాపకశక్తి పోయినా పర్లేదు..సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..ఇన్ని బాధలు పడడంకంటే ఇలా చేయడం మంచిదికదా?
-సతీష్

A.అన్ని జ్ఞాపకాలు కోల్పోయి ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే డెమెన్షియా రోగుల్ని ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు పొరపాటున కూడా జ్ఞాపకశక్తి పోవాలనుకోరు. మీరు తీవ్రమైన మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాగే ఉంటే ఆరోగ్య సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎదుటివారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ అదే గొప్ప అనుకుంటున్నారు. అలాగే ఉంటాను అదే మంచిది అనుకోవడం వల్ల మీరు సమాజంలో ఒంటరిగా మిగిలిపోతారు. ఉదాహరణకు మీరు ప్రేమించిన అమ్మాయినే తీసుకోండి. ఆమెకు మీ గురించి ఏమీ చెప్పలేదు. ఏదేదో ఊహిస్తున్నారు. పెళ్ళికి ముందే ఇలా అనుకునే మీరు తర్వాత ఎన్ని ఆంక్షలు పెడతారో! స్నేహమైనా మరే బంధమైనా సర్దుబాటు ధోరణి ఉంటేనే నిలుస్తుంది. అంత చక్కని చదువుకున్న అమ్మాయి కోరి మీ జీవితంలోకి వస్తానంటే మీరు మారాలి కానీ ఆమె కాదు. అసలు మీరు అనుకున్నట్టు ఎవరైనా ఎందుకు ప్రవర్తిస్తారు? మీ లక్షణాలు చెడ్డవి అని చెప్పలేం కానీ సమాజంలో నలుగురితో కలసి మెలసి ఉండాలంటే పనికిరావు. మీరన్న మర్చిపోవడానికి చికిత్స సాధ్యం కాదు. కానీ మీరు మానసిక వైద్యులను కలిస్తే పరిష్కారం దొరికే అవకాశం ఉంది.

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Also Read:

జీవితం విసుగ్గా ఉంది

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్