హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఈ రోజు ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణమని తెలిసింది. రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ పై మాదాపూర్ నీరూస్ చౌరస్తాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ మృతి చెందగా జహంగీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపిన రౌడీషీటర్, ఇస్మాయిల్, జహంగీర్ – మహ్మద్‌ల మధ్య కొన్నాళ్ళుగా రియల్ ఎస్టేట్ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో చర్చలకు అని పిలవగా ఇస్మాయిల్ – మహ్మద్ మధ్య మాట మాట పెరిగి కాల్పులకు దారితీసిందని ప్రాథమిక సమాచారం.
కాల్పుల ప్లానింగ్ ఎందుకు చేశారు.. ఏ వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది.. దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా. పదేళ్ళ క్రితం ఇదే నీరుస్ చౌరస్తాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇదే ప్రాంతంలో కాల్పులు హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది.