సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ రోజు పట్టపగలే దుండగులు కాల్పులకు పాల్పడి భారీగా సొమ్ము కొల్లగొట్టారు. దొమ్మాటకు చెందిన నర్సయ్య పంతులు అనే రియల్టర్ కారు డ్రైవర్ పరశరాములు కాలుపై గన్‌తో కాల్చి పరారయ్యారు దుండగులు. దుండగుడు గన్ ఫైర్ చేయడంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు బ్యాగ్‌లో ఉన్న 43లక్షల 50 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
నంబర్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలు పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చానని.. కారులో డ్రైవర్ కూర్చొని ఉండగా అద్దాలు పగలగొట్టి దుండగులు డబ్బులు ఎత్తుకుని వెళ్లినట్లు రియల్టర్ నర్సయ్యపంతులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా, మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో మిట్ట మధ్యాహ్నం దుండగులు తుపాకులతో కాల్పులకు దిగటం, భారీగా సొమ్ము కొల్లగొట్టడం పోలీసులకు సవాల్ గా మారింది.