Jayaraman: వీరనారి ఝాన్సీరాణి దళానికి శిక్షణ ఇచ్చిన వీరుడు !
స్వాతంత్ర్య సమర యోధుడు !
త్యాగధనుడు!
మహావీరుడుగా వినుతికెక్కిన జయరామన్ ముదలియార్.
ఈయన తమిళనాడులోని వేలూరు పరిధిలోని ఊసూరు అనే చిట్టిగ్రామంలో 1921 మార్చి 21న జన్మించారు.
యవ్వనంలోనే ఐఎన్ఎ INA (నేతాజీ) విభాగంలో విశిష్ట అధికారిగా పని చేసిన ఈయన అనైకట్టు ప్రాంతంలోని మౌంట్ అనే స్కూల్లో చదువుకున్నారు.
అప్పట్లో ఆయనున్న ప్రాంతంలో దేశభక్తులు ఎందరో ఉండేవారు. వారందరూ ఒక్కటిగా కలిసి గాంధీమహాత్ముడి గురించి పాటలు పాడుతుండేవారు. ఆ పాటలను నేర్చుకున్న జయరామన్ మౌంట్ స్కూల్లో పాడారు. కానీ ఆ స్కూలు ఆంగ్లేయుల యాజమాన్యంలోది కావడంతో అక్కడి ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఓ మాష్టారైతే కొట్టారు కూడా.
అయితే జయరామన్ ఊరుకోలేదు. తిరిగి ఆ మాష్టారుని కొట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఆయన ఆచూకీ కోసం వెతకని చోటంటూ లేదు. కానీ కొన్ని నెలల తర్వాత తెలిసిందేమిటంటే ఆయన హిట్లర్ ఆధ్వర్యంలోని జర్మనీ దళంలో పని చేస్తున్నట్టు!
ఆ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత దేశ విముక్తి కోసం హిట్లరు సాయం కోరారు.
“భారత స్వాతంత్ర్యం సాధించడానికి మీ దళంలో ఉన్న భారతీయ సిపాయిలను మాకు పంపగలరు” అని నేతాజీ అడిగారు.
హిట్లర్ అలాగేనని దాదాపు ముప్పై వేల వీరులను భారతదేశానికి పంపారు.
ఆ వీరులు రక్తంతో సంతకాలు చేసి మాతృభూమి స్వేచ్ఛకోసం పోరాడేందుకు వచ్చారు. అలా తిరిగీ భారతదేశానికి వచ్చిన వారిలో జయరామన్ ఒకరు.
సరైన ఆహారం ఉండేది కాదు. ఏ విధంగానూ సంపాదన ఉండదు. ప్రాణానికి హామీ లేదు. వీటన్నింటినీ మానసికంగా స్వీకరించి రక్తంతో సంతకాలు చేసి దేశాన్ని ఆంగ్లేయుల నుంచి కాపాడుకోవడానికి రండి! పోరాడుదాం!” అన్న నేతాజీ పిలుపునకు స్పందించి వేలూరు జిల్లా నుంచి మొట్టమొదటి వ్యక్తిగా ఐఎన్ఎ INAలో చేరి రాకెట్, ప్యారాచుట్ విభాగంలో ప్రత్యేక అధికారిగా సేవలు అందించిన మహావీరుడు జయరామన్ ముదలియార్.
స్వాంత్ర్య పోరాటంలో నేతాజీ సారథ్యంలోని సైన్యంలో పని చేసిన జయరామన్ ఝాన్సీరాణి దళానికి దట్టమైన అడవిలో యుద్ధానికి సంబంధించి శిక్షణ ఇస్తున్న సమయంలో ఆంగ్లేయులు అది తెలుసుకుని అడ్డుపడ్డారు. అయితే జయరామన్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆంగ్లేయులతో పోరాడారు. ఆ పోరులో జయరామన్ కుడి తొడలో తూటా దూసుకు పోయి తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయంతో ఏర్పడిన మచ్చ తుదిశ్వాస వరకూ ఉండిపోయింది.
నేతాజీ దళం ఓటమి అంచున ఉన్న దశలో ఆయన పని చేసిన సైనిక విభాగం నుంచి జయరామన్ ఇంటికి “ఆయన మరణించినట్టు” టెలిగ్రాం చేరింది.
ఆ వెంటనే మట్టికుండలను పేర్చి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో జయరామన్ శారీరకంగా మానసికంగా కృంగి కృశించి, నీరసించి, వాడిన వదనంతో, పెరిగిన గడ్డంతో గుర్తుపట్టలేని రీతిలో ఇంటికి చేరారు.
“ఎవరికి అంత్యక్రియలు చేస్తున్నారు?” అని అడిగినప్పుడు “మా అబ్బాయి సైన్యంలో మరణించాడంటూ టెలిగ్రాం వచ్చిన దరిమిలా అతనికి అంత్యక్రియలు చేస్తున్నాం” అని కుటుంబపెద్ద చెప్పారు.
అప్పుడు జయరామన్ “నేను బతికుండగానే అంత్యక్రియలు చేస్తున్నారా?” అంటూ సైనిక బూట్లున్న కాలితో అక్కడి మట్టికుండలను పగలగొట్టిన సంఘటనను ఆ ఊళ్ళో చెప్పుకునే వారు.
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల వివరాలు తెలుసుకున్నారు. వారిని రాష్ట్రపతి భవన్ కి సాదరంగా ఆహ్వానించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దళం కబుర్లు అడిగి తెలుసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకున్నారు.
దేశ స్వాతంత్ర్యంకోసం దాదాపు ఎనిమిదేళ్ళపాటు కుటుంబసభ్యులను వీడి పోరాడిన జయరామన్ స్వాతంత్ర్యానంతరం కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం విశేషం. 2007 డిసెంబర్ 8వ తేదీన ఆయన కాలధర్మం చెందారు.
జయరామన్ పోరాటపటిమను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకూడా ఆయనను సత్కరించాయి.
ఇటలీ దళ సభ్యుడిగా ఓ పోరులో జయరామన్ పలువురిని తుదముట్టించినందుకు ఆయనకు ”THE ITALY STAR” అనే బిరుదుతో సత్కరించారు. అలాగే జర్మనీ నేత ఆడాల్ఫ్ హిట్లర్ జయరామన్ సేవలను ప్రశంసిస్తూ గౌరవించారు.
– యామిజాల జగదీశ్
Also Read :