Thursday, March 6, 2025

భాషా సమస్య

“తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!”

చదువుల తల్లీ! సరస్వతీ! నిన్ను మదిలో ధ్యానించి…పుస్తకం చేతపట్టుకున్నాను. పుస్తకంలో ఉన్న విషయాన్నంతా నా మెదడులోకి చక్కగా బట్వాడా చేయి తల్లీ. నా లోపలినుండి మంచి మాటలను వెలికి వచ్చేలా చేయి తల్లీ. నా మాటలు సుశబ్దాలై ఇతరులకు ఆనందాన్ని కలిగించేలా చేయి తల్లీ. యావత్ ప్రపంచ విద్యార్థులకు ప్రార్థనా గీతం కావాల్సిన అజ్ఞాతకవి పద్యమిది.

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి దేవత. పెదవి దాటిన మాట వైఖరి-ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు.

మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు, వాక్యాలు, భావాల భాష పరా పశ్యంతి మధ్యమ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి…మారి…బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు.

మెదడులో ఇదివరకే రికార్డ్ అయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపిస్తుంది కానీ- ఆటోమేటిగ్గా జరగదు. మన ప్రయత్నంతోనే శబ్దం బయటికి వస్తుంది. ఆలోచన మెదడుది. మాటలు అందించేది మెదడు. శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి. నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వర పేటికలో తంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది. ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది. ఇంతకంటే లోతయిన వివరణ ఇక్కడ అనవసరం.

మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అక్షరం అంటే నశించనిది. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా ఏర్పడిందే లిపి.

లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది. తరువాత మెదడు చదువుతుంది. ఆపై నోరు పలుకుతుంది. బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది. పుస్తకం సరిగ్గా చదివితే ఏకకాలంలో కన్ను, మెదడు, నోరు, మనసు పనిచేస్తాయి. ఒట్టి శబ్దం చెవిన పడితే ఇంత సాంద్రంగా రికార్డు కాదు. అందుకే చదవాలి. మళ్లీ మళ్లీ చదవాలి. చదువుతూనే ఉండాలి. ఇదంతా మాతృభాషలో అయితేనే సులభమని ఒక అభిప్రాయం. పరభాష అయినా పట్టు సాధించవచ్చు అని మరొక అభిప్రాయం.

ఏ మీడియంలో చదవాలన్నది ఇప్పుడు పెద్ద సమస్య. భారత్ లాంటి దేశంలో లెక్కలేనన్ని భాషలు, యాసలు. చివరికి లిపేలేని భాషలు కూడా మనుగడలో ఉన్నాయి. ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రవాహంలో పడి ముందుకు వెళుతుంటే మనం కూడా అందులోనే మునిగి తేలాలి కదా! అన్నది మెజారిటీ వాదం. ఇంగ్లిష్ వ్యామోహంలో పడి…బతికి ఉండగానే మన మాతృభాషలకు మనమే తలకొరివి పెట్టాలా? అన్నది మరో వాదం. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం సాధ్యాసాధ్యాలమీద యుద్ధాలు మరో గొడవ.

రాజకీయనాయకుల అస్తిత్వ పోరాటానికి భాష ఆయుధం కావడం సంగతిని కాసేపు పక్కనపెట్టి… యునెస్కో ఆధ్వర్యంలోని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్- జి ఈ ఎం బృందం తాజాగా ఏమి కనుక్కుందో చూద్దాం. ప్రపంచంలో 40 శాతం మంది విద్యార్థులకు భాషా సమస్య వల్ల తామేమి చదువుతున్నామో అర్థం కావడం లేదని జి ఈ ఎం అధ్యయనంలో తేలింది. భూమ్మీద 25 కోట్ల మంది విద్యార్థులు వారిదికాని భాషలో చదువుతూ అర్థంకాక అయోమయంలో ఉన్నారు. పేద, అల్పాదాయ దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. అందువల్ల ఒక భాషను బలవంతంగా రుద్దకుండా స్థానిక అవసరాలను బట్టి బహుభాషల్లో విద్యాబోధన ఉండాలని జి ఈ ఎం సిఫారసు చేసింది.

దీనికి ఉదాహరణ కావాలంటే మనదగ్గర ఏదో ఒక గ్రామీణ ప్రభుత్వ లేదా ప్రయివేట్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ కు వెళ్ళండి. విద్యార్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మొదట పరిశీలించండి. తరువాత మాతృభాష అయిన తెలుగు భాషా సామర్థ్యాన్ని పరిశీలించండి. ఆపై సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్టుల్లోకి వెళ్ళండి. హంస నడకా రాక, కాకి నడకా రాక రెంటికీ చెడ్డ రేవళ్ళైన భావిభారత విద్యార్థులు లెక్కకుమించి కనపడతారు.

జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, చైనాలాంటి దేశాలు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా పి జి, పి హెచ్ డి స్థాయి దాకా వారి మాతృభాషలోనే బోధించగలుగుతున్నాయి. మనదగ్గర మాతృభాషలో బోధన ఒక ఆదర్శంగా, భావోద్వేగ నినాదంగా పనికి వస్తోంది కానీ…ఆచరణలో ఆదిలోనే హంసపాదులు పడ్డాయి. ఉదాహరణకు తెలుగు అకాడెమీ పుస్తకాల్లో సైన్స్ పాఠాలు తెలుగువారికి అర్థమైతే ఒక్కో ఊరికి ఒక్కో శాస్త్రవేత్త పుట్టేవాడు. అందులో అంతా తెలుగే. కానీ నన్నయ్య, శ్రీనాథుడే దిగివచ్చినా అర్థం కాని సంస్కృత దీర్ఘసమాస పదబంధుర బహు భార తెలుగు.
# విరళీకరణం
# వాయు విశిష్టోష్ణ నిష్పత్తి
# ద్రవ నిజ వ్యాకోచం
# ప్రతిదీప్తి
# బలాత్కృత కంపనం
# ఊహనం
# అయస్కాంత అభివాహ సాంద్రత
# ప్రాతస్థ తీగ
# ధన శూన్యాంశ దోషం
# ఏకమితీయత
# ఊర్ధ్వస్థిర నిశ్చల స్థితి
లాంటి ఒక్కో పారిభాషిక పదం అర్థం కావడానికి ఒక్కో భాష్యకారుడు పుట్టాలి. అందులో మాటలకంటే ఇనుప గుగ్గిళ్ళు చాలా మెత్తన! మాతృభాషలో విద్యాబోధన కావాలనుకునేవారు ముందు మాతృభాషలో సరళంగా, సూటిగా పాఠ్యపుస్తకాలు తయారుచేయించడం మీద దృష్టిపెట్టాలి.

ఈ కథనం రాయడానికి సైన్సును తెలుగు మీడియంలో ఎలా చెబుతున్నారోనని నాలుగు భౌతికశాస్త్ర పాఠాలను చదివాను. వాటిని చూశాక నాకు తెలుగు అక్షరం ముక్క కూడా చదవడం రాదని, వచ్చినా అర్థం కాదని స్పష్టంగా అర్థమయ్యింది!  నేను కూడా త్రిభాషా సూత్రం మెడకు కట్టుకుని మళ్ళీ తెలుగు ఓనమాలు నేర్చుకోవాలన్న ఎరుక కలిగింది!

అనంత వాయు విశిష్టోష్ణ నిష్పత్తితో;
సరళం కాని పాఠాలతో అవిరళ విరళీకరణల్లో;
ద్రవం నిజంగా వ్యాకోచించినప్పుడు…;
ఎందరు తెలుగు మీడియం సైన్స్ విద్యార్థులు బలాత్కృత కంపనాలకు గురయ్యారో!
వారి ఊహల్లో ఊహనం ప్రాతస్థ తీగగా ప్రతిదీప్తమయ్యిందో!
చివరికి మార్కుల కార్డులు వచ్చినప్పుడు అన్నీ సున్నాలుగా ధన శూన్యాంశ దోషమయ్యిందో!
బతుకు అర్థం కాని చదువుల అయస్కాంతానికి అతుక్కుని అభివాహ సాంద్రప్రవాహంలో కొట్టుకుపోతోందో!
బతికి ఉండగానే తెలుగు మీడియం ప్రేమవల్ల ఊర్ధ్వ స్థిర నిశ్చల స్థితికి ఎలా చేరుకుని త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారో! అర్థం కాని చదువుల చట్రాల్లో అర్థం లేని పరుగుల్లో ఎలా పోటీలు పడుతున్నామో!”
తెలిస్తే మన పిల్లలకు మనమే ఎంతటి రంపపు కోత పెడుతున్నామో అనుభవంలోకి వస్తుంది.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

యునెస్కో కోరుకున్నట్లు అర్థం కాని భాషలో కాకుండా అర్థమయ్యే భాషలో చదువులు చెప్పే రోజలు నిజంగా వస్తాయా! కనీసం కలలో అయినా వస్తాయా?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్