Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంస్వయంభువును నేను

స్వయంభువును నేను

Godman Nithyananda Names Himself As Chief Of Madurai Aadheenam

నిత్య ప్లస్ ఆనంద – సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం నిత్యానంద అవుతుంది. సవర్ణ దీర్ఘమయినా, వివర్ణ దీర్ఘమయినా, గుణమయినా, గుణరహితమయినా, ఆమ్రేడితమయినా…ఈ సంధులన్నీ మనుషులు మాట్లాడే భాషలకు సంబంధించినవి.

కుక్కలు, నక్కలు, ఆవులు, దున్నపోతులు, పులులు, సింహాల భాషకు వ్యుత్పత్తి, వ్యాకరణ, ప్రతిపదార్థాలు చెప్పగల నిత్యానంద ముందు చిన్నయసూరి బాల వ్యాకరణం, పెద్దయసూరి బహుజనపల్లి ప్రౌఢ వ్యాకరణాలు మూగబోతాయి. మూగబోవడం ధర్మం కూడా.

మీడియాలో నిత్యానందకు ముందు బిరుదునామంలా, ఇంటిపేరులా “వివాదాస్పద” అని రాస్తున్నారు. సంస్కృతంలో మాటకు ముందు చేరే “వి” ఉపసర్గ- కొన్ని మాటలకు విశేషమయిన అర్థం ఇస్తుంది.
ఉదాహరణ:-
శిష్ట- విశిష్ట
కొన్ని మాటలకు వ్యతిరేకార్థమిస్తుంది.
ఉదాహరణ:-
జాతి- విజాతి
మీడియా రాస్తున్న వివాదాస్పద మాటలో “వి” ఉపసర్గను విశిష్టమయిన వాదానికి ఆస్పదమయినవాడు- అంటే ఆధారమయినవాడు అని నిత్యానంద తన సొంత వ్యాకరణంతో అన్వయించుకున్నట్లున్నాడు.

ప్రేమ- పిచ్చి ఒకటే. నిజానికి ప్రేమలో పిచ్చి అంతర్భాగం. పిచ్చి ప్రేమ ఉంటుంది కానీ- పిచ్చిలో ప్రేమ ఉండకపోవచ్చు. లేక ఉన్నా మనం గుర్తించలేకపోవచ్చు. ప్రేమ పిచ్చిదయినపుడు…సాంకేతికంగా ప్రేమికుడు/ప్రేమికురాలు పిచ్చివారే కావాలి.

నిత్యానందకు మనమీద పిచ్చి ప్రేమ. అందువల్ల సహజంగా అయన ప్రేమ పిచ్చిదిగా అనిపిస్తుంది. ఆయనకు మన మీద పిచ్చి ప్రేమ ఉన్నంత మాత్రాన ఆయన పిచ్చివాడు కాదు. ఆయన ప్రేమలో మునిగి మనం పిచ్చి వాళ్లమయితే ఆయన పూచీ ఉండదు.

మనమంతా రౌరవాది నరకాల్లో పడి అలమటిస్తుంటే అందరికీ వీసాలు ఇచ్చి, స్టాంపింగులు వేసి, కైలాసంలో గ్రీన్ కార్డ్ లు ఇచ్చి శాశ్వతంగా ఉంచేయడానికి ఆయన సృష్టించిన కైలాసం మనకు పిచ్చిదిగా కనిపిస్తుంది కానీ- నిజానికది మన మీద ఆయనకున్న పిచ్చి ప్రేమకు ప్రతిరూపం.

తమిళనాడు మధురై పీఠానికి 293 పీఠాధిపతిగా నిత్యానంద తనను తాను ప్రకటించుకోవడం కూడా భక్తుల మీద పిచ్చి ప్రేమలో అంతర్భాగంగానే చూడాలి. రెండు పదాలు నిత్య- ఆనంద కలిస్తే నిత్యానంద ఒక పదమే అవుతోంది. కైలాసాన్నే సృష్టించిన అమేయ, అతులిత, తపస్సంపన్నుడికి ఒకే ఒక పదం ఉండడం భావ్యం కాదు. అందువల్ల-
“జగద్గురు మహా సన్నిధానం శ్రీలశ్రీ భగవాన్ నిత్యానంద పరమశివ జ్ఞానసంబంధ దేశిక పరమాచార్య స్వామి”
అని ఏకాదశి పదబంధ బంధురంగా పదకొండు పదాలతో పేరు పెట్టుకున్నాడు.Nithyananda Madurai mutt

Godman Nithyananda  :

రాముడికి వసిష్ఠుడు పేరు పెట్టాడు. కృష్ణుడికి గర్గుడు పేరు పెట్టాడు. నిత్యానంద తనకు తానే పేరు పెట్టుకున్నాడు. ఈ పదకొండు మాటల్లో భాషా భాగాల ప్రకారం ఏది విశేషణమో, ఏది నామవాచకమో కూడా నిత్యానందులవారే చెబితే బాగుండేది. సాధారణ వ్యాకరణం ప్రకారం చివరి పదం ముందున్నవన్నీ విశేషణాలే కావాలి. ఆ లెక్కన ఈ స్వామి-
పరమాచార్యుడు;
జ్ఞానసంబంధ దేశికుడు;
పరమశివుడు;
నిత్యానందుడు;
భగవానుడు,
శ్రీలశ్రీయుతుడు;
మహా సన్నిధానుడు;
జగద్గురువు అయి ఉన్నవాడు.

అన్నట్లు-
మధురై పీఠం 293 పీఠాధిపతిగా సుందరమూర్తి అని మరొకాయన్ను నియమించామని పీఠం అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ సోది అంతా ఎందుకు?
నిత్యానందకు!

డిస్ క్లైమర్:-
నాకు తెలిసిన తెలుగు ప్రకారం ఈ అర్థాన్ని గ్రహించాను. ఇంకా నాకు తెలియని జ్ఞానసంబంధ అనేక లోతయిన విషయాలు ఇందులో నిత్యమై, సత్యమై ఉండి ఉండవచ్చు. జ్ఞాన నేత్రాలు కలిగిన మహానుభావులకు అవి తోచవచ్చు. నా పరిమితికి నిత్యానందాన్ని కుదించానని మీకు అనిపిస్తే…నేను క్షమింపబడుదును గాక!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: 

నేనుంటే కరోనా ఉండేది కాదు!

Also Read:

రంగు రాళ్లు-మోసగాళ్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్