Friday, April 19, 2024
HomeTrending Newsఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు

ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు

కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందించనుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆక్ట్ (AFSPA) కు సవరణలు చేసి అస్సాం,మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలలోని కల్లోలిత ప్రాంతాలను తగ్గిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రకటించారు. ఈ చట్టానికి సవరణ చేయాలని దశాబ్దాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, వారి కల ఫలించే రోజు వచ్చిందని అమిత్ షా వెల్లడించారు. ప్రజల కోసమే పనిచేసే ప్రధానమంత్రి నరేంద్రమోడీ దశాబ్దాల డిమాండ్ ను అమలుచేసేందుకు ఆదేశాలు ఇచ్చారని హోంమంత్రి తెలిపారు. తాజా సవరణల ప్రకారం అస్సాం రాష్ట్రంలోని 23 జిల్లాలను కల్లోలిత ప్రాంతాల జాబితా నుంచి తొలగిస్తారు. ఒక జిల్లా మాత్రం కొంత చట్ట పరిదిలోకి వస్తుంది. 1990 సంవత్సరం నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రత్యేక చట్టం అస్సాంలో అమలులో ఉంది.

మణిపూర్ రాష్ట్రం మొత్తం ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. 2004 నుంచి ఈ చట్టం మణిపూర్ రాష్ట్రంలో అమలులో ఉండగా  రాజధాని ఇంఫాల్ నగరాన్ని మాత్రం అప్పుడు మినహాయించారు. తాజా సవరణలతో ఆరు జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్స్ ను ఈ చట్టం నుంచి మినహాయిస్తున్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఈ చట్టం 1995 సంవత్సరం నుంచి అమలులో ఉండగా దశల వారిగా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆక్ట్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడు జిల్లాల పరిధిలోని 15 పోలీస్ స్టేషన్స్ ను ఈ చట్టం నుంచి మినహాయించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.

అస్సాం, మణిపూర్,నాగాలాండ్ రాష్ట్రాల్లో తాజా సవరణలు ఏప్రిల్ ఒకటో తేది నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆక్ట్ ప్రకారం గతంలో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవటం, అరెస్టు చేసేందుకు పోలీసులు అధికారం కలిగి ఉండేవారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రత్యేక చట్టాన్ని మొత్తానికే రద్దు చేయాలని 2005 జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా 2015 లో త్రిపుర లో ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయగా, 2018లో మేఘాలయలో కేంద్రప్రభుత్వం రద్దు చేసింది.

Also Read : గ్రీన్ హైడ్రోజన్ తో పెట్రో ధరలకు కళ్ళెం

RELATED ARTICLES

Most Popular

న్యూస్