Saturday, January 18, 2025
HomeTrending Newsగుజరాత్‌లో పవర్‌హాలిడే - మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా

గుజరాత్‌లో పవర్‌హాలిడే – మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా

1998.. మార్చి.. గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 24 ఏండ్లు పూర్తయింది. 2001 అక్టోబర్‌లో ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రాష్ట్ర సీఎంగా పవర్‌లోకి వచ్చారు. 2014లో ప్రధాని అయ్యేదాకా సీఎం పదవిలోనే ఉన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు బీజేపీ నేతలు ఆ పదవిని అధిష్ఠించారు. మోదీ ఢిల్లీ గద్దెనెక్కినప్పటి నుంచి అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ రాజ్యమేలుతున్నది. ఇన్నేండ్ల పరిపాలన తర్వాత కూడా ఆ రాష్ట్రం కరెంటుకు కటకటలాడుతూనే ఉన్నది. వ్యవసాయానికి భారీగా కోతలు నడుస్తున్నాయి. గత శుక్రవారం నుంచి గుజరాత్‌లో రైతులు విద్యుత్తు కోసం ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం తాజాగా పరిశ్రమలకు ఏకంగా వారానికి ఒకరోజు పవర్‌ హాలిడే ప్రకటించారు. దాదాపు పాతికేండ్ల అధికార పర్వంలో విద్యుత్తు సమస్యను అధిగమించలేకపోయారు.
ఇక్కడ ఉన్నది డబుల్‌ ఇంజిన్‌.. దాని పేరు మోదీ మాడల్‌

2014 జూన్‌ 2.. తెలంగాణ పుట్టిన రోజునాటికి రాష్ట్రం అతి తీవ్రమైన విద్యుత్తు సంక్షోభంలో ఉన్నది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారంలో పడిపోతుందని ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం శాపనార్థాలు పెట్టారు. స్వరాష్ట్రంలో కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట దృష్టి సారించింది విద్యుత్తు రంగంపైనే. ఆరంటే ఆరు నెలల్లో సంక్షోభం మటుమాయమై పోయింది. పరిశ్రమలకు, ఇండ్లకు, దుకాణాలకు 24 గంటలు కోతల్లేని కరెంటు సరఫరా మొదలైంది.. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు ప్రారంభమైంది. ఇవాళ 2022.. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క క్షణం కూడా ఆగకుండా కరెంటు సరఫరా అవుతున్నది. గరిష్ఠ డిమాండ్‌ ఎంత వచ్చినా.. బ్రహ్మాండంగా కరెంటు అందుతున్నది.
ఇక్కడ ఉన్నది సింగిల్‌ ఇంజిన్‌.. దాని పేరు కేసీఆర్‌

ఎనిమిదేండ్లలోనే కేసీఆర్‌
24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వగలిగినప్పుడు..
24 ఏండ్ల పరిపాలనలో
మోదీ గుజరాత్‌కు ఎందుకు ఇవ్వలేకపోయారు?
ఎవరిది సమర్థత?
ఎవరిది అసమర్థత?
ఎవరివి కోతలు?
ఎవరివి చేతలు?
ప్రగల్భాలకు.. కార్యసాధకుడికి ఉన్న తేడా ఇది..

2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్‌ మాడల్‌’. గుజరాత్‌లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో ప్రచారం జరిగింది. ఇగ ఆయన దేశానికి ప్రధాని అయితే.. ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో కాచుకోండంటూ.. కమలం పూలు పెట్టేశారు. ఇవాళ మోదీ పాలన ఏమిటో.. గుజరాత్‌ మాడల్‌లోని డొల్లతనమేందో బయటపడిపోయింది. ఇటీవల ఐదు రాష్ర్టాల ఎన్నికలప్పుడు డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. కేంద్రంలో.. రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి సూపర్‌గా జరిగిపోతుందని చెప్పుకొంటూ వచ్చారు. మరి మోదీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయింది. గుజరాత్‌లోనూ తన పార్టీయే అధికారంలో ఉన్నది. కానీ.. కరెంటు కోసం ఐదు రోజులుగా ఆ రాష్ట్ర రైతులు మండుటెండల్లో రోడ్లమీదకు వచ్చి హాహాకారాలు చేస్తున్నారు. పులిమీద పుట్రలా గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) అక్కడి పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్‌ హాలిడే ప్రకటించింది. సంస్థ టెక్నికల్‌ డైరెక్టర్‌ హెచ్‌పీ కొఠారీ రాష్ట్రంలోని నాలుగు డిస్కంలు, ట్రాన్స్‌మిషన్‌ సంస్థల ఎండీలకు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనే ఈ దుస్థితి మోదీ సమర్థతకు అద్దం పడుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బలా తయారైందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

గుజరాత్‌లో ట్రబుల్‌ ఇంజిన్‌
గుజరాత్‌ లాంటి డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ రాష్ర్టాల్లో అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తున్నదంటూ మోదీ, ఆయన అనుచరగణం గొప్పలు చెప్పుకోవడంలో తక్కువేం లేదు. కానీ గుజరాత్‌లో విద్యుత్తు పరిస్థితి మాత్రం నానాటికి తీసికట్టు.. నాగంభొట్లులా మారిందని తాజాగా జీయూవీఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు చెప్పకనే చెప్తున్నాయి. మంగళవారం నాటి ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, దీనిని క్షేత్రస్థాయిలో అమలుచేసేలా అధికారులను ఆదేశించాలని, సంబంధిత పరిశ్రమలకు కూడా దీనిని తెలియజేస్తూ.. కచ్చితంగా ఒకరోజు పవర్‌ హాలిడే పాటించేలా చూడాలని స్పష్టంచేశారు. ఇప్పటివరకు డబుల్‌ ఇంజిన్‌ అంటూ ఊదరగొట్టిన బీజేపీ నేతలకు.. గుజరాత్‌ ఓ ట్రబుల్‌ ఇంజిన్‌ అని తేలిపోయింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో.. అదీ అడుగకముందే నిధులు కుమ్మరిస్తున్నప్పటికీ సోకాల్డ్‌ గ్రోత్‌ ఎటు పోయిందో బీజేపీ నేతలు వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

కేసీఆర్‌.. సింగిల్‌ ఇంజిన్‌.. డబుల్‌ గ్రోత్‌..
బీజేపీయేతర పాలిత రాష్ర్టాలంటే.. సింగిల్‌ ఇంజిన్‌ రాష్ర్టాలంటూ ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు.. తెలంగాణలో అప్రతిహతంగా అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నందుకు ఏం చెప్తారో వినాలి. తెలంగాణకు ఉన్న సింగిల్‌ ఇంజిన్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే. తెలంగాణ వచ్చినప్పుడు విద్యుత్తు విషయంలో ఉన్న పరిస్థితిని, గడిచిన ఏడున్నరేండ్ల కాలంలో విద్యుత్తు విషయంలో సాధించిన ప్రగతిని చూస్తే.. కేవలం సింగిల్‌ ఇంజిన్‌తోనే డబుల్‌ గ్రోత్‌ సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందించి సత్తా చాటారు. 2018 జనవరి ఒకటి నుంచి దేశంలోనే ఎవరూ సాధించని విధంగా వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల పాటు పూర్తి ఉచితంగా, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 13,162 మెగావాట్లను గతేడాది మార్చి 26 న దాటేసి తెలంగాణ సత్తా చాటింది. ఆ రోజు 13,688 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ నమోదయ్యింది. ఈ నెలలో గడిచిన నాలుగు రోజుల్లో మూడుసార్లు రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. గతేడాది రికార్డును ఈ నెల 26 బ్రేక్‌ చేసి, 13,742 మెగావాట్లు నమోదయ్యింది. మంగళవారం 14,160 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదవ్వడంతో దక్షిణ భారత దేశంలోనే అత్యధిక డిమాండ్‌ ఉన్న రాష్ర్టాల్లో రెండో స్థానంలో నిలిచింది.

పవర్‌ ఫుల్‌..
తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతున్నా.. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతోపాటు.. పూర్తి ఉచితంగా అందిస్తున్న వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల నిరంతరాయ విద్యుత్తులో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవ్వలేదు. 17,500 మెగావాట్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ స్థాయిలో విద్యుత్తు వ్యవస్థలను బలోపేతం చేసి సిద్ధంగా ఉంచామని విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి దేశ ప్రదాని సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు అప్పుడే వారానికి ఒకరోజు పవర్‌ హాలిడేలు ప్రకటిస్తే.. తెలంగాణలో మాత్రం ఏమాత్రం తొణక్కుండా.. బెణక్కుండా.. అన్ని వర్గాలకు, రంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందించడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇటు వ్యవసాయంలో పంటలు పొట్ట దశకు వచ్చాయి. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా గృహ వినియోగంలో విద్యుత్తు వాడకం పెరిగింది. నీటి పారుదల, తాగునీటి కోసం ఎత్తిపోతల పథకాలూ పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ.. పరిశ్రమలకు ఒక్క క్షణం ఆగకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఘనత మన విద్యుత్తు సంస్థలదే. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అని చెప్పుకొనే గుజరాత్‌లో అప్పుడే చేతులెత్తేశారు. కానీ తెలంగాణలో.. కేసీఆర్‌ అనే సింగిల్‌ ఇంజిన్‌.. ఇక్కడ డబుల్‌ గ్రోత్‌ను చూపిస్తూ.. పవర్‌ ఫుల్‌గా అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నారు. ఇదీ.. కోతలరాయుడికి.. చేతల ప్రభుత్వానికి ఉన్న అంతరం.

కోతలపై రైతుల నిరసన
గుజరాత్‌లో అన్నదాతలను కరెంట్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి కనీసం 3 గంటలు కూడా కరెంటును సరఫరా చేయడంలేదు. దీంతో వేలాదిమంది రైతన్నలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదికొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొదలైన నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. వ్యవసాయానికి 8 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేస్తామన్న సర్కారు మాటతప్పిందని అన్నదాతలు మండిపడ్డారు. రైతులకు మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

డబుల్‌ ఇంజినా.. ట్రబుల్‌ ఇంజినా?: మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా
గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు సంధించారు. పవర్‌ ఫుల్‌ వ్యక్తులుగా చెప్పుకొనే వారి సొంత రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? అని వ్యంగ్యాత్మకంగా ప్రశ్నించారు. ఇది డబుల్‌ ఇంజినా? లేక ట్రబుల్‌ ఇంజినా? అని విమర్శించారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడేను ప్రకటిస్తూ గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని షేర్‌ చేశారు.

Also Read : తెలంగాణ స్త్రీనిధి దేశానికి ఆదర్శం

RELATED ARTICLES

Most Popular

న్యూస్