కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం మంచి పరిణామమని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని, ఈ విషయంలో చొరవ చూపినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడికి కృతజ్ఞతలు తెలియజేశారు. విభజన చట్టం ప్రకారమే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చామని…కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించే అధికారం కేంద్రానికి ఉందని, ఏ ఒక్కరూ కూడా ఏకపక్షంగా వ్యవహరించకుండా, అందరికీ సమన్యాయం చేసే విధంగా ఈ బోర్డులు కృషి చేస్తాయని వివరించారు. 19 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వివరించారు.
ఈ.డబ్ల్యు.ఎస్. రిజర్వేషన్లు అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జీవీఎల్ చెప్పారు. బిజెపి యువమోర్చా అధ్వర్యంలో దీనికోసం పోరాటం కూడా చేశామని గుర్తు చేశారు. దీనివల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన రాజ్యంగ అవకాశాలను ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
పి.డి. ఖాతాల్లో జరిగిన కోట్ల రూపాయలు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా ప్రభుత్వం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని, గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పటి ప్రభుత్వం కూడా వ్యవహారిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను కేంద్రంపై నెట్టినట్లే ప్రస్తుత వైసిపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వ్యవహారిస్తున్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలు సమర్ధిస్తున్నామన్నారు. టిడిపి ప్రభుత్వ హాయంలో జరిగిన 53వేల కోట్ల అవినీతిపై ఎందుకు నోరు మెదపరని, యనమలకు పంటి నొప్పా అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.