యూ ట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి ఇందూరుకు చెందిన ఓ స్టూడెంట్ ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించింది. నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన సతీశ్‌కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్ పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూతురు హారిక పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది.
డాక్టర్ కావాలన్న కోరిక ఉన్నా నీట్ కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ యూట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. కాలేజీలో సీటు వచ్చినా ఫీజు, హాస్టల్, బుక్స్ ఫీజులు కలిపి కనీసం రూ.రెండు లక్షల వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతోంది. తాను ఎంబీబీఎస్ చదివేందుకు దాతలు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటోంది.