తెలుగు రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తెలంగాణను వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. మూడు రోజులుగా ముసురు పట్టింది. ఎండ ముఖం చాటేసింది. తాజాగా.. తెలంగాణలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ట్వీట్ చేసింది. గురువారం కూడా (జులై 14) తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. దాదాపు 17వ తేదీ వరకూ తెలంగాణలో వర్ష ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 14వ తేదీన తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని..కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
జులై 18వ తేదీకి గానీ..వచ్చే సోమవారానికి గానీ తెలంగాణను వాన ముసురు వీడేలా లేదు. హైదరాబాద్ నగరంలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారి బలపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇందుకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.