పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 50 మంది శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతపై అధ్యయనం నిర్వహించారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపానికి కారణమవుతున్నట్టు కనుగొన్నారు.
శిలాజ ఇంధనంతో నడిచే అన్ని మౌలిక సదుపాయాలను కొనసాగిస్తే పారిశ్రామిక కాలంనుంచి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పెరిగిపోతుందని, ఇది చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తేల్చారు. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటుకంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరుగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. 2035 నాటికి ప్రపంచం తమ గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో 60 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన లీడ్స్ వర్సిటీ ప్రొఫెసర్ పియర్స్ ఫాస్టర్ పేర్కొన్నారు.