హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం. దీంతోపాటు ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను, నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్న కేంద్రం అందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రం విమోచన దినోత్సవం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కిషన్ రెడ్డి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు వివిధ శాఖలతో చర్చలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంతోపాటుగా, ఏడాదిపాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖలు రాశారు.
ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ విమోచన దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మైలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Also Read : తెలంగాణ ఏర్పడిన వేళ