ICC T20 Wc Pakistan Beat Afghanistan By 5 Wickets :
ఐసీసీ టి 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. నేడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో గెలుపొంది గ్రూప్-2లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు కావాల్సిన దశలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘన్ బౌలర్ కరీం వేసిన 19వ ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఆసిఫ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ ‘ దక్కింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లో ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ షాజాద్ (8) పెవిలియన్ చేరాడు. గుర్జాబ్-10; అస్ఘర్-10; కరీం జనత్-15 కూడా త్వరగా ఔటయ్యారు. నజీబుల్లా జార్డాన్-21 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ మహమ్మద్ నబీ-35; గుల్బదిన్-35 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీం రెండు, షహీన్ అఫ్రిది, హారిస్ రాఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మూడో ఓవర్లో మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ బాబర్ అజమ్, ఫఖర్ జమాన్ తో కలిసి రెండో వికెట్ కు 63 పరుగులు జోడించారు. ఫఖర్ 30 పరుగులు చేసి నబీ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. మహమ్మద్ హఫీజ్ (10) త్వరగా ఔటయ్యాడు. కెప్టెన్ బాబర్ 47 బంతుల్లో 4 ఫోర్లతో 51; షోయబ్ మాలిక్-19 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో ఆసిఫ్ అలీ మెరుపులతో ఐదు వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, ముజీబుర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Must Read : పాకిస్తాన్ కు రెండో విజయం