Saturday, January 18, 2025
HomeTrending Newsబతికి ఉంటే బలుసాకయినా తినవచ్చు

బతికి ఉంటే బలుసాకయినా తినవచ్చు

If  You Want To Survive You Have To Fly : 

ఎగిరిపోవాలి…
ఎలాగైనా…
ఎందాకైనా
ఎక్కడికైనా.
ఇక్కడినుంచి వెళ్లిపోతే చాలు.
ఎగిరిపోవాలి..
ప్రాణాలు పణంగా పెట్టయినా..
ప్రాణాలతో సహా ఎగిరిపోవాలి.
ప్రాణాలే కావాలంటే, అక్కడే వుండొచ్చు.
బతికుండాలంటే మాత్రం ఎగిరిపోవాలి.
బతుకులో ఎంతోకొంత జీవితం మిగిలుండాలంటే మాత్రం ఎగిరిపోవాలి.
..
రన్నింగ్ బస్సు ఎక్కొచ్చు..
రన్నింగ్ ట్రెయిన్ ఎక్కొచ్చు..
విమానం ఎగురుతుండగా ఎప్పుడైనా ఎక్కారా..
ఒకరు కాదు, ఇద్దరు కాదు..
వందలు, వేల మంది
ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ
ఎలాగైనా ఈ గడ్డ నుంచి ఎగిరివెళ్ళిపోవాలి..
ఇదొక్కటే ఆశ
ఇదొక్కటే ఆశయం
పైనుంచి తలుపులు మూతపడుతున్నాయి…
కింద నుంచి తుపాకులు పేలుతున్నాయి..
విమానం రెక్కలనుంచి జనం రాలిపడుతున్నారు.
అయినా..చివరి ఊపిరి వున్నంత వరకు
ఎగిరిపోవాలన్న ప్రయత్నం ఆగలేదు.


శతృవువెడో.. మితృడెవడో జానేదెవ్..
శతాబ్దాల చదరగంలో
ఓటమిగెలుపుల తేడాలిక్కడ లేనే లేవు
బ్రిటన్ పోతే రష్యా..
రష్యా పోతే అమెరికా..
ఎవడైతేనేం..
కాపాడే వంకతో వచ్చిన కాలనాగులే అందరూ.
వార్ లార్డ్స్..
ముజాహిదీన్లు,
తాలిబాన్లు..
ఎవడైతేనేం..
మతం కోసం.. ప్రాంతం కోసం…
సమాజాన్ని స్మశానం చేసి
శవాల దిబ్బలనేలే సామంత రాజులే అందరూ..
ఆడుకుని ఆడుకుని వదిలేసిన ఆటబొమ్మ అఫ్గనిస్తాన్..
తన్ని తన్ని విసిరేసిన ఫుట్ బాల్ కాబూల్..
అంతర్జాతీయ కుట్రలు
అంతఃకలహాలు
అంతులేని విషాదాలు..
ఎడారి దేశాన్ని తడుపుతున్నవి ఎడతెగని కన్నీళ్లే

ఇక్కడ యుద్ధాలు కొత్త కాదు..
ఇక్కడ ఆయుధాలు కొత్త కాదు..
ఇక్కడ గాయాలు కొత్త కాదు..
ఇక్కడ మరణాలు కొత్త కాదు..
వందల ఏళ్లక్రితమే వేలాది బ్రిటిష్ సైన్యాన్ని తరిమికొట్టిన చరిత్ర వుంది..
అమెరికా అండతో రష్యాని
అరబ్బుదేశాల బలంతో అమెరికాని ఎదుర్కొన్న వ్యూహం వుంది
అంతర్యుద్ధంలో ఆటవికరాజ్యాన్నిచవిచూసిన అనుభవం వుంది
అడుగుగునా ఆంక్షల బతుకు బతికిన నేపథ్యం వుంది
మతోన్మాదపు పరాకాష్టను చూసిన జ్ఞాపకాలున్నాయి.
యుద్ధానికీ యుద్ధానికీ మధ్య విరామమే శాంతి అంటారు..
ఇక్కడ యుద్ధమూ శాంతీ కలగలిసే వుంటాయి.
గెలుపు ఓటమి కలగాపులగంగా వుంటాయి.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి..
విదేశీశక్తల్ని తరిమి కొట్టామంటుంది తాలిబాన్లు
స్వదేశీ ఉన్మాదానికి భయపడి పారిపోతున్నారు అఫ్గాన్లు
ఇక మనపాలన అంటుంది తాలిబాన్..
మతం పెత్తనం కంటే పరాయిపాలనే నయం అనుకుంటున్నారు..అఫ్గన్లు
ప్రాణాలకు విలువలేని తాలిబనిస్తాన్ కావాలో..
ప్రాణాలకు తెగించి పారిపోవాలో..
తేల్చుకోవాల్సిన విషాదం ఇది.

Also Read : విమానాల మానం తీసిన తాలిబన్లు

-కే.శివప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్