Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅయ్యిందా పెళ్లి?

అయ్యిందా పెళ్లి?

Marriages- Mentalities: (ప్రభాకర్ అన్న పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న ఒకానొక పోస్ట్ ఇది. ఇందులో మనల్ను మనం వెతుక్కోవచ్చేమో చూడండి)

ఆ మధ్యన ఎవరో పిలిస్తే ఒక పెళ్లివేడుకకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా లేదు కాబట్టి చాలామందే వచ్చారు. ఆటొ దిగగానే ఆహ్వానాలు అవ్వీ బాగానే జరిగాయి. హాలు ద్వారం దగ్గర ఇద్దరు చిరునవ్వు చెరగని అమ్మాయిలు గులాబీ పువ్వులు చేతికిస్తూ స్వాగతం పలికారు. ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద లోనికి వచ్చేవాళ్లు కనిపిస్తున్నారు. కొంచెందూరంలో పెళ్ళికొడుకు తండ్రి, నన్ను ఆహ్వానించినవాడు, చిన్ననాటి స్నేహితుడు, చిరునవ్వుతో దగ్గరకువచ్చి కుశలప్రశ్నలువేసి కూర్చోమన్నాడు. ఏ‌సి కారణంగా చల్లగా ఉంది. ఇంతలో ఒకతను ట్రేలో కప్పులతో చాలా జాగ్రతగా నడుస్తూ ప్రతి ఒక్కరిదగ్గరా ఆగి కప్పు తీసుకోమంటున్నాడు. నేను ఓకప్పు అందుకున్నాను. కాఫీ చల్లదనానికి పళ్ళు జివ్వుమన్నాయి. తాగకుండా క్రింద పెట్టేశాను. కాసేపట్లో నేను అనుకున్నది అయింది, వెనకాల కూర్చున్న పెద్దావిడ నేను క్రింద ఉంచిన కాఫీ కప్పు తన్నేసి, ఏమీ ఎరగనట్లు బుద్దిమంతురాల్లా కూర్చుంది. ఆవిడ తన్నినప్పుడు నేను వెనక్కితిరిగి చూశానని నావైపు క్రూరంగా చూసింది. పైగా అటువేపు వెడుతున్న కుర్రాడిని పిలిచి “చూడు నాయనా ! ఇక్కడ ఎవరో కాఫీ తన్నేశారు అంది.

ఎవరో పెద్దాయన “ బోజనాలు చేసేవాళ్ళు లేవండి, టిఫిన్లు తినేవాళ్లు కూడా రావచ్చు” అన్నారు. చాలామంది ఒక్కసారిగా లేచి బోజనాలవేపు పరుగులాంటి నడకతో కదిలారు. అది చేతి బోజనము అంటే బఫే అన్నమాట. నిలబడి తినటం అలవాటులేని పెద్దవాళ్ళకు ఓప్రక్కగా బల్లలు వేశారు. ఒకావిడ కావలసినవి పెట్టించుకోకుండా అన్నీ ఒక్కసారి పళ్ళెంలో పెట్టించుకోవడంతో పళ్ళెం ఒకవైపు బరువుతో తలక్రిందులై ఎదురుగా ఉన్న పట్టుచీరావిడ మీద పడింది. పచ్చళ్లు, గులాబ్ జామ్ పాకం చీరంతా డాగులమయం చేశాయి. అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. ఆడవారు పరుగు పరుగునవచ్చి ఆవిడను తీసుకెళ్లి చీర మార్పించారు. ఐనా బోజనాలు ముగిసేంతవరకూ మాటల యుధ్ధం జరుగుతూనే ఉంది. తర్వాత ఐస్ క్రీమ్ బల్ల దగ్గర చిన్న మాటల యుద్ధం జరిగింది. “ మీరు ఇంతక్రితం ఓకప్పు పట్టుకెళ్లారుకదా! “ అన్నాడు బల్ల దగ్గర కుర్రాడు. “ మాచెల్లి తీసుకెళ్లింది, మేము కవలపిల్లలం. ఇచ్చేటప్పుడు చూసుకోవాలి, అంతేకానీ అలా అడగకూడదు. మేమేమన్నా కక్కుర్తిగాళ్ళమా! జాగ్రతగా మాట్లాడు” రెచ్చి పోయింది ఓకవలపిల్ల. ఇంతలో మేళాలు మార్మోగాయి, మంత్రాలు వినపడ్డాయి. అందరూ కుర్చీలకోసం హాల్లోకి పరుగులుతీశారు. నా ప్రక్కన కూర్చున్నాయన “ కాస్త కుర్చీ చూడండి, చేతులు కడుక్కొస్తాను” అంటూ గబగబా సింకువైపు నడిచాడు. అంటే చేతులు కడుక్కోకుండా పరుగు పరుగున సీటుకోసం వచ్చేశాడన్నమాట.

ముహూర్తం దగ్గర పడుతోంది అన్న సూచనగా తెల్లగొడుగులతో ఫొటోగ్రాఫర్ వచ్చేశాడు. నాలుగు పెద్దపెద్ద గొడుగులు స్టేజ్ మీద అమర్చాడు. రెండు చిన్న గొడుగులు వధూవరులకు ఎదురుగా పెట్టాడు. అక్కడితో వాడు అలగ్జాండర్ ప్రపంచాన్ని ఆక్రమించినట్లుగా స్టేజ్ అంతా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. పంతులుగారిని పక్కకి తప్పుకోమని చెబుదామని అన్నుకున్నాడు కానీ బావుండదని ఊరుకున్నాడు. “పెళ్లికూతురిని బుట్టలోపెట్టి తీసుకొచ్చారు” గొడుగు ఆవతలఉన్న ఓముసలాయన క్రిందవాళ్ళకి చెప్పాడు. మరుక్షణం ఫొటోగ్రాఫర్ ఆయన్ని పక్కకు లాగేశాడు. ఆయన కోపంతో క్రిందకివచ్చి కుర్చీలు ఖాళీ లేక వెనగ్గా నిలబడ్డాడు. తర్వాత తెలిసింది ఆయన పెళ్లికూతురు తాత అని. కొంతసేపు గడిచాక “ జీలకర్రా బెల్లం పెట్టుకున్నారు, వాయించండర్రా భజంత్రీలు “ అన్నారు పంతులుగారు గొడుగుల మధ్యలోంచి. ఇంతలో ఒక మహిళామణి కట్టబోయే తాళిని పట్టుకుని ఆడవారిచేత ముట్టిస్తోంది. అంతవరకు ముక్కులు శుభ్రం చేసుకున్న ఒకావిడ ఆచేతులతోనే తాళిని ముట్టుకుని పవిత్రం చేసింది.

ఓ అరగంట తర్వాత మళ్ళీ ఫొటోగ్రాఫర్ పూర్తిగా పురివిప్పి రంగంలోకి దిగాడు. గొడుగులు తొలగిస్తే కొత్తదంపతులను చూద్దామనుకున్నా కానీ రెండు పెద్ద కొత్త గొడుగులను తెచ్చి మధ్యలో పెట్టాడు. బంధువర్గం కొత్తదంపతులతో ఫోటో తీయించుకోడానికి స్టేజ్ మీదకి ఉప్పెనలా చేరుకున్నారు. బంధువులు కొత్తదంపతుల తలలమీద నాగుపాములు పైనుంచి అక్షంతలు వదులుతున్నట్లుగా ఫోజులు పెట్టి దాదాపు వంద ఫోటోలు తీయించుకున్నారు, మనుషులు మారారు కానీ ఫోజులు మాత్రం ఒకటే.

నేను వచ్చేటప్పుడు జనం తగ్గుతారు ఓ చక్కటి ఫోటో తీసి ఇంట్లో చూపిద్దాము అనుకున్నాను. ఫోటో చాలా చక్కగా వచ్చింది, పిల్లలిద్దరూ గొడుగుల మధ్యలోంచి చాలా చక్కగా పడ్డారు.

(రచయిత అనుమతి లేకుండా వాడుకున్నందుకు క్షమాపణలతో..)

Also Read :

పెళ్లికి చావు లేదు

Also Read :

శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!

Also Read :

నాతో నాకే పెళ్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్